పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిత్యవసర వస్తువులు మొదలుకొని కరెంటు చార్జీలు, పెట్రోల్ రేట్ల పెరుగుదల మోత మోగిపోయింది. ధరలు పెరుగుదలతో సామాన్యుడి నడ్డి విరగగొట్టినట్లయింది. ఉప్పులు, పప్పులు, మసాలా సరుకులు, నూనెలు, పాలు ఇలా ప్రతీది అడ్డు అదుపు లేకుండా ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోయాయి. ధరలు పెరుగుదలతో బ్రతుకు భారమే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని రకాల నిత్యావసర వస్తువులు 30 నుంచి 90 శాతం మరికొన్ని వంద నుంచి 200 శాతం వరకు పెరిగాయి. బియ్యం సన్న రకం కిలో రూ.26 ఉండగా ఇప్పుడు రూ.60 కు చేరింది. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.80 ఉండగా రూ.120 అమ్ముతుండగా, పామాయిల్ 60 నుంచి రూ.100 వరకు పెరిగింది. మినప్పప్పు రూ.80 నుంచి రూ.135 అయింది. పెసరపప్పు రూ 130, కందిపప్పు రూ.170 అమ్ముతున్నారు. జీలకర్ర వెల్లుల్లి రూ.200 పైమాటే అమ్మారు. పాలు లీటరు రూ.72కు అమ్ముతున్నారు. నెలకు రూ.150 నుంచి రూ.300 మధ్య వచ్చే విద్యుత్ బిల్లులు ప్రస్తుతం రూ.600 నుంచి రూ.1000 వరకు వస్తున్నాయి. శ్లాబులు మార్పు, సర్దుబాటు చార్జీలు, వినియోగ చార్జీలు అన్నీ కలుపుకుని అధిక శాతం బిల్లు వస్తుంది. అసలే నిత్యవసర వస్తువులు ధరలు మండిపోతుంటే దీనికి తోడు కరెంటు బిల్లుల షాక్ తగులుతుంది. పెట్రోల్ రూ.79.07, డీజిల్ రూ.73 ఉండగా ప్రస్తుతం పెట్రోల్ రూ.109.31, డీజిల్ రూ.97.17 కు చేరింది. వివిధ రకాల పన్నులతో పాటు సర్ చార్జీలను విధించడంతో ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చార్జీలను అమాంతం పెంచేశారు. చెత్త పన్ను పేరిట కూడా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇలా రోజు ధరలు పెరిగిపోతుండడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు దినదిన గండంగానే రోజు గడుస్తుంది. అత్యవసర వస్తువులు కొనాలంటే భయం, కరెంటు బిల్లు వస్తే ఆందోళనతో సగటు పేదవాడు బతుకు జీవుడా అంటూ జీవనం సాగిస్తున్నాడు. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి
జగ్గంపేట
నిత్యావసర వస్తువులు, కరెంటు చార్జీలు, పెట్రోల్ రేట్ల మోత
దిన దిన గండంగా సామాన్యుడి జీవనం