ఘనంగా పూలే 197వ జయంతి వేడుకలు...

విద్య ద్వారానే సామాజిక రుగ్మతలను మార్చేందుకు కృషి చేసిన మహనీయుడు పూలే.. --ప్రొఫెసర్ హరిబాబు.

విద్య ద్వారానే వ్యవస్థను మార్చేందుకు కృషి చేసిన మహనీయుడు,బడుగు జీవుల విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు అన్నారు. బుధవారం ఏకేయూ సమావేశపు హాలులో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాజమోహన్ అధ్యక్షతన జరిగిన పూలే 197వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరిబాబు మాట్లాడుతూ ఆనాటి రోజుల్లో సమాజంలో పాతుకొని పోయి ఉన్న కుల వివక్షత, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించి, మహిళా విద్య ద్వారానే వ్యవస్థను మార్చేందుకు అహర్నిశలు శ్రమించిన ధీరోదాత్తుడు పూలే అని కొనియాడారు. నిరక్షత తాండవిస్తున్న ఆనాటి రోజుల్లో ప్రజలను చైతన్య వంతులుగా తీర్చి దిద్దేందు కోసం మహిళా విద్యను అందించేందుకు 1848వ సంవత్సరంలో బాలికా పాఠశాలను, వార పత్రికలను  ప్రారంభించడమే కాకుండా మానవ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఘనత జ్యోతి రావు పూలేకు మాత్రమే దక్కుతుందని ఆయన అన్నారు. నేటి యువత,విద్యార్ధినీ విద్యార్ధులు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని లక్ష్య సాధనలో ముందుకు సాగాలని ప్రొఫెసర్ హరిబాబు సూచించారు. సభాధ్యక్షులు ప్రొఫెసర్ రాజ మోహన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అస్పృశ్యత, అంటరాని తనం వంటి సామాజిక రుగ్మతలను రూపు మాపేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఉద్యమాలకు గురువుగా, సంఘ సంస్కర్తలకు ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన పూలే ఆనాటి రోజుల్లో బాలికా విద్య ద్వారానే స్త్రీ జనోద్దరణకు  శక్తి సామర్థ్యాలను వినియోగించి పని చేయడం జరిగిందని అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వంటి మహనీయులు సైతం తమ గురువు పూలే అని చెప్పుకోవడం అనేది జరిగిందని,దీనిని నిశితంగా పరిశీలించి నట్లయితే పూలే ఎంతటి మేధావి అనేది చెప్పకనే అర్థమవు తుందని అన్నారు. ఆంద్ర కేసరి విశ్వ విద్యాలయం సి. ఈ.డాక్టర్ కె.వి.ఎన్.రాజు మాట్లాడుతూ సమాజంలో వివక్షతకు గురైన మహిళల సంక్షేమం కోసం ఆయన అనాధ శరణాలయాలను స్థాపించడం జరిగిందని, శూద్ర,అతి శూద్ర వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన ధీరోదాత్తుడు పూలే అని కొనియాడారు. అంతే కాకుండా "ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు" అనే నానుడిని 19వ శతాబ్ద కాలంలోనే గుర్తించి మహిళల అభ్యుదయానికి పాటు పడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతి రావు పూలే అని డాక్టర్ రాజు పేర్కొన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన మేధావి కార్పూర్ ఠాకూర్ వంటి నేతలు పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పాలన సాగించడం జరిగిందన్నారు.భారత దేశం విద్యా బాండాగారమని, అటువంటి దేశంలో 19వ శతాబ్దంలో స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు పూలే తొలుత తన సతీమణి సావిత్రీ భాయి పూలేకు స్వయంగా చదువు చెప్పి తద్వారా బాలికా విద్యను ప్రోత్సహించిన ఘనుడు పూలే అని డాక్టర్ రాజు పేర్కొన్నారు. ఎన్.ఎస్.ఎస్. యూనివర్సిటీ సమన్వయ కర్త డాక్టర్ మండే.హర్ష ప్రీతం దేవ్ కుమార్ మాట్లాడుతూ పూలే ఏదో ఒక కులానికో, మతానికో చెందిన వ్యక్తిగా కాకుండా సాంఘిక సంస్కరణ కోసం వెలుగెత్తి పోరాడిన యోధుడు అని అభివర్ణించారు. అంతే కాకుండా మానవుడు స్వేచ్చగా పుట్టాడు కానీ సర్వత్రా సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సామెతను ఆయన వివరించారు. అంతేకాకుండా చదువు ద్వారానే మానవుని దశ,దిశా మారుతుందని నిరూపించిన మహనీయుడు పూలే అని ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడిచి విద్యా వ్యాప్తి కోసం పాటు పడాలని డాక్టర్ హర్ష ప్రీతం దేవ్ కుమార్ కోరారు. బాల్య వివాహాల నిషేధం, వితంతు వివాహాల నిర్వహణకు పూలే ఎంతగానో శ్రమించారని, ఆయన అడుగు జాడల్లో నేటి యువత ముందుకు సాగాలని ఉమెన్స్ సెల్ సమన్వయ కర్త డాక్టర్ అంచుల భారతి దేవి పేర్కొన్నారు. ఏకేయూ ఇంజనీరింగ్ విభాగం ఇంఛార్జి డాక్టర్ ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్న జాతుల సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమించిన బహుముఖ ప్రజ్ఞాశాలి జ్యోతిరావు ఫూలే అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు పూలే గురించి,ఆయన సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీకి చెందిన అధ్యాపక, ఆధ్యాపకేతర సిబ్బంది,పరిశోధక విద్యార్థులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

About The Author: Admin