ప్రభుత్వ భూమికి..! హెచ్ఎండిఏ అనుమతులు..!

లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌..! అసలు కొన్నదెంత..? ఆక్రమణలో ఉన్నదెంత..?

శాఖల సమన్వయ లోపంతో.. రోజురోజుకు కనుమరుగు అవుతున్న ప్రభుత్వ భూములు..

కొనుగోలు చేసింది 12.5 ఎకరాలా..?15 ఎకరాలా.? విస్తరించింది మాత్రం 19.00 ఎకరాల పైచిలుకు.?

జాయింట్ సర్వే కోసం 2024 ఏప్రిల్ 15న దుండిగల్‌ తహశీల్దార్ హెచ్ఎండిఏకి లేఖ..

సుమారు మూడు నెల్లు కావస్తున్నా..! సర్వే ఊసేలేదు..! మళ్ళీ పనులు షురూ..

హెచ్ఎండిఏ అనుమతులతో ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు..

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూలై 4:చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రెవెన్యూ యంత్రాంగం తయారైంది.!ఓవైపు వేలకోట్లు విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే..! సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.. మరోవైపు "శ్రీ లక్ష్మి శ్రీనవాస కన్‌స్ట్రక్షన్" సంస్థకు మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు బహిరంగంగానే సహకరిస్తున్నట్లు..! 2021 నవంబర్‌లో అప్పటి కలెక్టర్ ఎస్.హరీష్ ఆదేశాలతో తేటతెల్లం అయింది.. కబ్జాదారులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే పలుకుబడితో అధికారులని బదిలీ చేయవచ్చేమో కానీ..! కబ్జాలని దాచిపెట్టలేరని, తహశీల్దార్ హెచ్ఎండిఏ కమిషనర్‌కు గత ఏప్రిల్ 15న పంపించిన లేఖతో స్పష్టమైంది.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం- ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. అంతే మిగతా ఫైరవీలు, అధికారులపై పెత్తనం అంతా "సేమ్ టు సేమ్"..! అక్రమార్కులకు సహకరించడం కోసం.. కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు ఎలాగో ఉండనే ఉన్నారు.. ఇక్కడ హాస్యాస్పద విషయం ఏమిటంటే..! అప్పుడు పదవిలో ఉన్నోళ్ళమాట జిల్లా అధికారులు వినాలని ఆదేశాలు ఉండగా..! ప్రస్తుతం భిన్నంగా తయారైంది.. ఏ పదవి లేకపోయినా..! కొందరు నాయకులు అధికార పార్టీ అన్న అహంతో అధికారులను ఎడాపెడా వాయిస్తున్నట్టు సమాచారం.. 

2021 నవంబర్‌లో కలెక్టర్ ఆదేశాలు..!కేసునమోదుకు కమిషనర్ ఫిర్యాదు..

 

సామాన్యులకో న్యాయం..! బడా నిర్మాణ సంస్థలకో న్యాయమా..?

పేదలు 60 గజాల్లో నిర్మించుకున్న అక్రమ నిర్మాణాన్ని అరగంటలో కూల్చివేసే రెవెన్యూ,మున్సిపల్ అధికారులు..! మల్లంపేట్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ వెంచర్ నిర్వాహకులపై అలాంటి చర్యలు ఎందుకు లేవు..? 2021లో కలెక్టర్ ఎస్.హరీష్ చర్యలకు ఆదేశాలు అబద్దమా..? వెంచర్ నిర్వహాకురాలుపై కేసు నమోదు చేయడం అబద్దమా..? 2022 అక్టోబర్‌ 3న మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్‌లు 208 విల్లాలు నిషేధిత జాబితాలో పెట్టడం అబద్దమా..? ప్రభుత్వ భూములు కబ్జాలకు అప్పగించేందుకే అయితే అధికారులు దేనికి..? విఆర్వో, ఆర్ఏల వ్యవస్థను ఇతర శాఖలకు పంపించింది ఇందుకేనా..? సిబ్బంది కొరతతో ప్రజల ఆస్తులు పరులకు కట్టబెట్టడానికా..? అలా చేసిన ప్రభుత్వాలు నామ రూపాలు లేకుండా పోయింది కూడా చూస్తున్నాం.. లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కి సహకరించడంలో అధికారులే కీలక పాత్ర పోషించారని చర్యలు లేని రెవెన్యూ నిర్లక్ష్యం అందుకు నిదర్శనం..!

2022 అక్టోబర్ 3న 208 విల్లాలు నిషేధిత జాబితాలో పెట్టిన రిమైండర్..

 

వెంచర్ నిర్వాహకులు కొన్నదెంత..? ఉన్నదెంత..?

ప్రభుత్వ భూములు కాపాడటంలో రెవెన్యూ వ్యవస్థ విఫలమైందని స్పష్టమవుతుంది.. వెంచర్ నిర్వాహకులు "కొన్నది ఎంత..? ఆక్రమణలో ఉన్నది ఎంత..?" అనేది స్థానికుల ప్రైవేటు సర్వేలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి..! ఈ విషయం అధికారులకు తెలిసినా గోప్యంగా ఉంచారా..? లేక సర్వేలో తేల్చే వరకు సంబంధిత రెవెన్యూ అధికారులకైనా తెలుసా..? తెలియదా..? సుమారు రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి 4.1.0 ఎకరాలు అదనంగా ఆక్రమణలో ఉన్నట్టు సర్వే లెక్కలు చెబుతున్నాయి..ప్రైవేటు సర్వే అనంతరం కొత్తగా 7.5 ఎకరాలు కబ్జాలో ఉన్నట్టు తెలుస్తోంది.. తాజాగా జరిగిన కొన్ని రిజిస్ట్రేషన్‌‌లు ప్రభుత్వ భూమిలోనే జరిగాయా..? కొనుగోలు చేసిన భూమిలోనా అధికారులే తేల్చాలి..!

మూడు నెలలుగా జాయింట్ సర్వే పెండింగ్‌..! కావాలనే కాలయాపన..?

మల్లంపేట్ సర్వే నెంబర్ 170 ప్రభుత్వ భూమిలో గత మార్చినెలలో రెండు జేసిబిలతో తవ్వకాలు..! చదును చేస్తున్నారనే ఫిర్యాదులతో రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేశారు.. సదరు వ్యక్తులకు హెచ్ఎండిఏ నుండి అనుమతులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు..! హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నప్పటికీ..!నాడు తవ్వకాలు జరుపుతున్నది సర్వే నెంబర్ 170 ప్రభుత్వ భూమిలోనే..! అందుకే జాయింట్ సర్వే కోసం..! గత ఏప్రిల్ 15న హెచ్ఎండిఏ కమిషనర్‌కు, దుండిగల్‌ తహశీల్దార్ లేఖ రాశారు.. మూడు మాసాలు గడిచినా సర్వే ఊసే లేకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.. 

తాజాగా పనులు షురూ..! రాజకీయ ప్రమేయమేనా..?

అధికారుల అండ ఉంటే చార్మినార్‌ను కూడా కబ్జాచేసే రోజులివి..! సర్వే నెం.170 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు రాజకీయ ప్రమేయం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.. మూడు నెలల క్రితం పనులు నిలిపివేసిన అదేచోట.. అధికారులను మేనేజ్ చేస్తూ..! జాయింట్ సర్వేను పెండింగ్‌లో పెట్టి రెండు రోజులుగా పిల్లర్‌లకు పుట్టింగ్‌లు వేస్తున్నారు.. ఇప్పటికైనా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) స్పందించి..! వెంచర్ మొత్తాన్ని సర్వే చేసి "శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌" కొన్నది ఎంత..? ఆక్రమణలో ఉన్నది ఎంతో..? సర్వేలో తేల్చాలని స్థానికులు కోరుతున్నారు.. పారదర్శకతతో సర్వే నిర్వహించిన ప్రైవేటు సర్వేలో మొత్తం సుమారు 20 ఎకరాలు ఉన్నట్టు‌ ఆరోపిస్తున్నారు.. మరి అధికారుల సర్వే కూడా పారదర్శకతతో ఉండాలని భావిస్తున్నారు.. ప్రస్తుతం హెచ్ఎండిఏ అనుమతులతో జరుగుతున్న పనులు నిలిపివేసి జాయింట్ సర్వే త్వరితగతిన పూర్తిచేసి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు..

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.