పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 15: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని పుల్లల చెరువు ఎస్సై సంపత్ కుమార్ అన్నారు. పుల్లల చెరువు మండలం పీవీ పల్లి, కొత్తూరు గ్రామలల్లో సైబర్ నేరాలు, డయల్ 100, సీసీ కెమెరాలు తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై అన్నారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రతిఒక్కరూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్నంగా ఉండాలన్నారు. ఫోన్లో ఎవరైనా బ్యాంకు ఖాతాల వివరాలు లేదా ఓటీపీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు. అదే విధంగా ఫోన్ లేదా మెయిల్ ద్వారా వచ్చే వెబ్సైట్లను ఓపెన్ చేయవద్దన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మన ఫోన్లు, కంప్యూటర్లు హ్యాక్ చేసి డాటా మొత్తం సేకరిస్తారన్నారు.అదే విధంగా ఏదైనా ప్రమాద పరిస్థితులు, దొంగలు,అనుమానితులు ఆకస్మికంగా దాడి చేసినప్పుడు డయల్ 100కు సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుని సహాయం అందిస్తారన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఒక్క సీసీ కెమెరా 10మంది పోలీసులతో సమానమన్నారు.గ్రామాలలో ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండి అందరిలో చైతన్యం రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.