కొమరోలు పెన్ పవర్ జూలై 18:
ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులను సరసమైన ధరలకు విక్రయించేందుకు నిర్ణయించిందని కొమరోలు తాసిల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు. కొమరోలు లోని గంగిశెట్టి శ్రీనివాసులు చెందిన కిరాణా దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు .సదరు కౌంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాసిల్దార్ మల్లికార్జున నాయుడు, ఎంపీడీవో నరసింహారావు, కొమరోలు మాజీ ఎంపీటీసీ సభ్యులు ముత్తుముల సంజీవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కౌంటర్ కు ప్రారంభోత్సవం చేసిన అనంతరం తాసిల్దార్ మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేదలు చాలా ఇబ్బందులు గురవుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించిందని, అయితే సరసమైన ధరలకు నిత్యవసర వస్తువులు అందజేసి పేద ప్రజలను ఆదుకోవాలనఆదుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బజార్లు, పెద్ద సంస్థాగత రిటైల్ షాపులలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నదని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో 181 రూపాయలకు విక్రయిస్తుండగా ,రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్ల ద్వారా 160 రూపాయలకే విక్రయించేందుకు చర్యలు తీసుకున్నదని, అలాగే ఒక రకం కిలో బియ్యం 55 రూపాయల 85 పైసలుగా విక్రయిస్తుండగా, సదురు బియ్యాన్ని కౌంటర్ల ద్వారా 49 రూపాయలకు ,రెండవ రకం బియ్యం 52-40 రూపాయలుగా ఉండగా ఆ బియ్యాన్ని 48 రూపాయలకు విక్రయించేందుకు నిర్ణయించినట్లుగా ఆయన చెప్పారు. రాబోవు రోజులలో కొమరోలు మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు .కావున పేద వినియోగదారులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు .ఆ కార్యక్రమంలో కొమరోలు విఆర్ఓ రమణారావు , గిద్దలూరు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ షేక్ రసూల్ , దుకాణం యజమాని గంగిశెట్టి శ్రీనివాసులు, పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, జనసేన పార్టీ మండల ఇన్చార్జి గజ్జలకొండ నారాయణ, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.