శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకుల నడుమ శనివారం అట్టహాసంగా జరిగింది. ముందుగా శ్రీరామనగర్ కాలనీలోని విజయ గణపతి ఆలయం నుంచి బీపీ అగ్రహారం వరకు అభిమానులతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి వాహనంలో భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు నాయకులు, పట్టణ ప్రజల మధ్య నాలుగు మాడ వీధుల గుండా అభివాదం చేస్తూ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు శ్రీనివాసులను వెనక కూర్చోబెట్టుకుని తానే స్వయంగా స్కూటీని నడుపుకుంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు చేరుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడి నుంచి ఆయన ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మిద్దెల హరి, అంజూరు శ్రీనివాసులతో కలిసి ఆర్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీ వాణి రెడ్డి వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. నామినేషన్ వేసిన అనంతరం ఆర్వో కార్యాలయం బయట బియ్యపు మధు మీడియా ముఖంగా మాట్లాడారు. నేనెప్పుడూ లోకల్.. ఆయన ఎప్పుడూ నాన్ లోకలే అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి పై విమర్శలు చేశారు. మనకు ప్రాణం మీదకొస్తే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటామనీ, అలా కాదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు పోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనంటూ సుధీర్ రెడ్డినుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అన్నా అంటే నేనున్నాననే నేను కావాలో..లేకుంటే ఏం కావాలన్నా హైదరాబాద్ కు రండిని చెప్పే సుధీర్ రెడ్డి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. సుధీర్ రెడ్డి లాగా నాకు గోవాలో ఇల్లు లేదనీ, నేను శ్రీకాళహస్తిలోనే ఉంటున్నాననీ, ఇక్కడే నా జీవితమని స్పష్టం చేశారు. నా నామినేషన్ కు వచ్చిన జనసంఖ్యను చూస్తే గత ఎన్నికల్లో నా మెజారిటీ గుర్తుకు వచ్చిందనీ, ఈ ఎన్నికల్లో అంతకుమించి మెజారిటీని నా నియోజక వర్గ ప్రజలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నవరత్నాలతో పేదల బతుకుల్లో నవ్వులు పూయించిన జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గురుమూర్తిని, మదన్నను గెలిపించాలని కోరారు.
*బావతో కలిసొచ్చిన 'ఎస్ఎస్ఆర్'
ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఇన్నాళ్లు ఎడమొఖం పెడ ముఖం గా ఉన్న ఆయన బామ్మర్ది సామాను శ్రీధర్ రెడ్డి అనూహ్యంగా తన అక్క, బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి తో కలిసి శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద తన అనుచరగణంతో సందడి చేశారు. అంతేనా.. అక్కడితో ఆగకుండా అక్కను తీసుకొని నేరుగా ఆర్.ఓ కార్యాలయానికి వెళ్లి శ్రీ వాణి రెడ్డి వద్ద నామినేషన్ దాఖలు చేయించారు. ఇన్నాళ్లు మధుసూదన్ రెడ్డి, సామాను శ్రీధర్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితులు ఉండేవి. అయితే బావ నామినేషన్ నాడు విభేదాలన్నిటి నీ పక్కన పెట్టి ఎస్ఎస్ఆర్ తన అక్కతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు ఎన్ని చెప్పినా.. బావ బామ్మర్దుల మధ్య బంధం ఎటు పోతుందని చెవులు కొరుక్కుంటూ కొందరు ముక్కున వేలేసుకున్నారు.