డిప్యూటి కమిషనర్ మౌనం.. చట్టాన్ని తుంగలో తొక్కిన ఘనులు..?
బహుదూర్‌పల్లిలో అక్రమ షెడ్డుకు టౌన్‌ప్లానింగ్ అధికారుల ‘అండ’..?
-అధికార పార్టీ సిఫార్సులకు టిజి-బిపాస్ చట్టాన్ని తాకట్టు పెట్టి తలవంచారా..?
రూ.లక్షల్లో డీల్ కుదుర్చుకుని..? ప్రభుత్వ ఖజానాకు గండి..?
ఫిర్యాదులు వెళ్ళినా పట్టించుకోని ఏసిపి.. చకచకా పూర్తైన అక్రమ షెడ్డు..!
ఈ వ్యవహారంలో ఏసిపి నుంచి చైన్‌మెన్ వరకు సహకరంపై ఆరోపణలు..!
బహుదూర్‌పల్లిలో టిజి-బిపాస్ చట్టాన్ని బహిరంగంగానే తుంగలో తొక్కుతూ, టౌన్‌ప్లానింగ్ అధికారుల అండతో అక్రమ షెడ్డు నిర్మాణం పూర్తికావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. దున్నపోతు మీద వర్షం పడిన వైనాన్ని అవలంభిస్తున్న అధికారులు.. ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో చేతులు మారినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మరోవైపు ఉన్నతాధికారులకు వాటాలు వెళ్తున్నందునే చర్యలు లేవనే విమర్శలు దుమారం లేపుతోంది..దుండిగల్ సర్కిల్-59, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, టౌన్‌ప్లానింగ్ విభాగం నిర్లక్ష్యం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది..
దుండిగల్, పెన్ పవర్, మార్చి 23:
దుండిగల్ సర్కిల్-59 పరిధిలోని బహుదూర్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు స్వయంగా నిబంధనలను పక్కనబెట్టి వ్యవహరించారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.. ‘టిజి-బిపాస్’ చట్టాన్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తూ, ఒక అక్రమ షెడ్డు నిర్మాణం పూర్తి స్థాయిలో ముగియడం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది.. అధికార పార్టీ సిఫార్సులకు తలొగ్గిన అధికారుల దోపిడీకి నిదర్శనమని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తాయి.. దుండిగల్ టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్, టిపిఎస్ అధికారులు చట్టబద్ధ బాధ్యతలను విస్మరించి, అధికార పార్టీకి చెందిన యువ నాయకుడి సిఫార్సులకు లోబడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణం ప్రారంభ దశలోనే నిలిపివేయాల్సిన అధికారులు, నిర్మాణం పూర్తయ్యే వరకు చోద్యం చూస్తూ ఊరుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
కమిషనర్ దృష్టికి వెళ్లినా చర్యలు శూన్యం..!
ఈ అక్రమ నిర్మాణంపై పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఫలితం శూన్యమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ ఏసిపి, టిపిఎస్ అధికారులు నిర్మాణదారునికి అండగా నిలవడం పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ‘చైన్‌మెన్’ నుంచి కమిషనర్ బాహాటంగానే సహకారం..? ఈ వ్యవహారంలో కేవలం ఒక్కరు కాదు, కమిషనర్ స్థాయి నుంచి ఫీల్డ్ స్థాయి చైన్‌మెన్‌ల వరకు సమన్వయంతో వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ షెడ్డు నిర్మాణ దారునితో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని, చర్యలు తీసుకోకుండా సహకరించినట్లు స్థానికులు చెబుతున్నారు..
రూ.లక్షల్లో లావాదేవీలు..?
ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి లక్షల రూపాయలు చేతులు మారినట్టు సమాచారం బయటకు వస్తోంది.. ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన ఫీజులు, పెనాల్టీలు అధికారులు అడ్డదారుల్లో స్వాహా చేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.. చట్టం సాధారణ ప్రజలకు మాత్రమేనా..? అధికార పార్టీ నేతలకు, అక్రమార్కులకు వర్తించదా..? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇలా వ్యవహరిస్తే, నగర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని మండిపడుతున్నారు..
బహుదూర్‌పల్లిలో ఈ అక్రమ భారీ షెడ్డు నిర్మాణం పూర్తి కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యమే కాదు, బరితెగించి సహకారించారనే అనుమానాలు బలపడుతున్నాయి.. ఈ వ్యవహారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది..ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపి, టిజి-బిపాస్ చట్టాన్ని తుంగలో తొక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..



