అంగన్వాడి కేంద్రం,సచివాలయం, బీసీ బాలుర వసతి గృహం తనిఖీ
కాజులూరు/తాళ్లరేవు, పెన్ పవర్,మార్చి 28:
జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం కాజులూరు, తాళ్లరేవు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడి కేంద్రం, కాజులూరు గ్రామ సచివాలయం, తాళ్లరేవు మండలం కోరింగ బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.చేదువాడ అంగన్వాడి కేంద్రం పరిశీలన.తొలుత కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.అక్కడ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం,గుడ్ల నాణ్యత, తాగునీటి సదుపాయం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.చిన్నారుల హాజరు, ఆరోగ్య పరిస్థితి, పోషకాహార పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటిస్తూ వారు నేర్చుకున్న పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం విశేషం. అంగన్వాడి కేంద్రానికి ప్రహరీ గోడ, తాగునీటి సదుపాయం కల్పించాలని అంగన్వాడి టీచర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.కాజులూరు సచివాలయంలో ఆకస్మిక తనిఖీ
అనంతరం జిల్లా కలెక్టర్ కాజులూరు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడి గ్రామ ప్రజలకు అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.హాజరు రిజిస్టర్లు, మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది సమయపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. రీ-సర్వే పనుల పురోగతి, గ్రామస్తులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.కోరింగ బీసీ బాలుర వసతి గృహంలో పారిశుద్ధ్యంపై అసహనం
తదుపరి తాళ్లరేవు మండలం కోరింగ బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహంలోని గదులు, భోజన సదుపాయాలు, విద్యార్థుల వసతి పరిస్థితులను పరిశీలించారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం, తాగునీరు, వసతి, ఇతర సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా మరుగుదొడ్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంపై జిల్లా కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడానికి గల కారణాలను సిబ్బందిని ప్రశ్నించి తెలుసుకున్నారు.గదులు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.ప్రభుత్వ సేవల నాణ్యతపై కలెక్టర్ దృష్టిప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, విద్యార్థులు మరియు చిన్నారులకు కల్పిస్తున్న సదుపాయాల నాణ్యతపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ పర్యటన ద్వారా స్పష్టమైంది.


