విజయనగరం పెన్ పవర్ మార్చి 03: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన (సెన్సస్ 2027) ప్రక్రియను జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా, మొదటి దశ అయిన ‘గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన’ (హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్) పై జిల్లా చార్జి లెవెల్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలక్టరు మరియు అదనపు ప్రిన్సిపల్ సెన్సస్ అదికారి సేతు మధవన్ మంగళవారం ఉదయం ఎం.వి.జి.ఆర్. ఇంజనీరింగు కాలేజి (చింతలవలస)లో ప్రారంభించారు.
మార్చి 3 నుండి 5 వరకు జరిగే ఈ మూడు రోజుల శిక్షణా కార్యక్రమాలలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూరి అవగాహన పెంచుకోవాలని జాయింట్ కలక్టర్ పిలుపునిచ్చారు. జనగణన ప్రక్రియ పకడ్బందిగా నిర్వహించాలని, జనన గణన కార్యక్రమాన్ని ప్రతిష్మాకంగా తీసుకోవాలని, జననగణన డేటా సేకరణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అదికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది బాధ్యతయుతంగా పని చేసి విజయనగరం జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, లోప రహితంగా పూర్తి చేసి విజయనగరం జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. శిక్షకులకు డిజిటల్ గా జన గణన కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు స్టాప్టే వేర్ ద్వారా తెలియజేయుటకు, తమ సందేహలను నివృత్తి చేయుటకు జనగణన జాయింటు డైరక్టరు, 13 మంది ట్రైనర్స్ అందుబాటులో వున్నారని తెలిపారు. దేశ అభివృద్ధి దిశను నిర్ణయించే అత్యంత కీలక కార్యక్రమమైన భారత జనగణన 2027 “మన గణన – మన భవిష్యత్తు” అనే నినాదంతో నిర్వహించబడుతున్న ఈ మహా యజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచిగా నిలుస్తుందని జిల్లా జాయిట్ కలెక్టర్ పేర్కొన్నారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది వంటివన్నారు.. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనకు, అలాగే సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరవేయడానికి ఖచ్చితమైన గణాంకాలు అత్యవసరమని తెలిపారు. “మీరు సేకరించే ప్రతి అంకె దేశ భవిష్యత్తుకు పునాది – ఖచ్చితమైన సమాచారం ఇద్దాం, దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం.” అని తెలిపారు. జనగణన జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమానికి శిక్షణకు గైర్హాజరు కావడం లేదా విధుల్లో నిర్లక్ష్యం వహించడం తీవ్రంగా పరిగణించబడుతుందని, మూడు రోజులు తప్పనిసరిగా అధికారులు, సిబ్బంది శిక్షణ పోందాలని జాయింటు కలక్టరు ఆదేశించారు.
జన గణన సేకరణలో ముఖ్యంశాలు: డిజిటల్ విప్లవం : ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరించబడతాయి. సిఎంఎంఎస్ మరియు హెచ్ఎల్బిసి వెబ్ అప్లికేషన్ల వినియోగంతో డేటా సేకరణ వేగవంతం, ఖచ్చితత్వం మరియు పారదర్శకత పెరుగుతుంది.
స్వయం నమోదు (సెల్ఫ్ ఎన్రోల్మేంట్): పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడుతుంది.
రెండు దశలు : మొదటి దశ: ఇళ్ల జాబితా సేకరణ (హౌస్ లిస్టింగ్ & హౌస్ సెన్సస్), రెండవ దశ: జనాభా వివరాల సేకరణ (పాపులేషన్ ఎన్రోల్మెంట్)
డిజిటల్ నైపుణ్యం: ప్రతి ఎన్యూమరేటర్ తనకు కేటాయించిన లాగిన్ వివరాలతో యాప్‌ను సక్రమంగా నిర్వహించడం, డేటా ఎంట్రీ మరియు సర్వర్‌కు లింక్ చేయడం నేర్చుకోవాలి. ఆఫ్‌లైన్ మోడ్ వినియోగంపై స్పష్టత కలిగి ఉండాలి.
ఖచ్చితమైన నమోదు: వయస్సు, విద్యార్హత, వృత్తి, సామాజిక వర్గం, మౌలిక వసతుల వివరాలు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి.
సమయపాలన: నిర్దేశిత గడువులోగా ప్రతి ఇంటిని సందర్శించి గృహ జాబితా పూర్తి చేయాలి. ఓవర్‌లాపింగ్ లేకుండా మ్యాపింగ్ సక్రమంగా నిర్వహించాలి.
డేటా గోప్యత: సేకరించిన సమాచారాన్ని బయట వ్యక్తులకు లేదా సోషల్ మీడియాలో పంచుకోవడం చట్టరీత్యా నేరం. సమాచార భద్రత విషయంలో రాజీ పడకూడదు.
శిక్షణలో ప్రధాన అంశాలు: ప్రతి ఇంటి సందర్శన – ఎవరినీ వదలకూడదు ఖచ్చితమైన సమాచారం మాత్రమే నమోదు చేయాలి. గృహ నిర్మాణం, నీటి వనరు, మరుగుదొడ్డి, విద్యుత్, వంట ఇంధనం, ఇంటర్నెట్ సౌకర్యం వంటి 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరణ. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఐటి హెల్ప్ డెస్క్ ఏర్పాటు, క్షేత్రస్థాయిలో సందేహాల నివృత్తికి ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు.

ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మరళి, జనగణన జాయింటు డైరక్టరు, జనగణన ట్ర్కైనర్లు, సి.పి.ఒ. బాలాజి, డి.ఇ.ఒ. మణిక్యం నాయుడు, సర్వె శాఖ ఎ.డి. విజయకుమార్, ఎన్.ఐ.సి. అధికారి బాలసుబ్రమణ్యం, జెడ్పి సి.ఇ.ఒ. బి.వి.సత్యనారాయణ, ఎస్.సి. కార్పోరేషన్ ఇ.డి. డి.వెంకటేశ్వరరావు, ఆర్.డి.ఒ.లు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా అదికారులు, తహసిల్దార్లు, యంపిడిఓలు, సంబంధిత శాఖల అదికారులు, సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.


