- అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశం
- నీటి వృథా నివారణకు సమిష్టి కృషి అవసరం
- భవిష్యత్ తరాల కోసం నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి
రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 22:
అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన సందేశాన్ని అందించారు. నీరు మనిషి జీవనానికి ప్రాణాధారం అని, నీరు లేకుండా జీవనం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా తాగునీటి సమస్య రోజురోజుకీ పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నీటి వినియోగంలో మితవ్యయం పాటించడం అత్యంత అవసరమని తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, నీటి వృథాను నివారించడం, చెరువులు, కాలువలు, నదులను పరిరక్షించడం ద్వారా నీటి వనరులను కాపాడుకోవచ్చని చెప్పారు.
ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో నీటి సంరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నీరు ఉన్నప్పుడే దాని విలువను గుర్తించి జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. నీటిని ఆదా చేయడం అంటే మన భవిష్యత్‌ను కాపాడుకోవడమే అని తెలిపారు.
నీటి సంరక్షణ ఒకరి బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. అందరూ కలిసి కృషి చేస్తేనే భవిష్యత్ తరాలకు తగినంత నీటిని అందించగలమన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించేందుకు సంకల్పం చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.



