ePaper
Wednesday, March 18, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినేటితో ముగిసిన మున్సిపాలిటీల పదవీకాలం

నేటితో ముగిసిన మున్సిపాలిటీల పదవీకాలం

📰 Generate e-Paper Clip

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ నర్సీపట్నం, మార్చి 17:

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పదవీకాలం నేటితో ముగియనుంది. నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత ఇప్పటికీ రెండు మార్లు ఎన్నికలు జరిగాయి. మొదట తెలుగుదేశం పార్టీ బోర్డును కైవసం చేసుకోగా, రెండవసారి వైసిపి జెండా ఎగిరింది. తొలి ఎన్నికలు 27 వార్డులకు జరుగగా టిడిపి తరఫున చింతకాయల అనిత చైర్ పర్సన్ గా ఐదేళ్లపాటు పాలన సాగించారు. రెండవసారి జరిగిన ఎన్నికలలో ఒక వార్డు పెరిగి 28 వార్డులు అయ్యాయి. ఈ దఫా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బోర్డును కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో చైర్ పర్సన్ దళిత మహిళకు రిజర్వు కావడంతో గుడబండి ఆదిలక్ష్మి చైర్పర్సన్ గా ప్రమాణస్వీకారం చేశారు. వైస్ చైర్మన్లుగా గొలుసు నరసింహమూర్తి, తమరాన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పార్టీలో అంతర్గతంగా చైర్మన్, వైస్ చైర్మన్ ల పదవీకాలం రెండున్నర సంవత్సరాలుగా అంగీకారం చేసుకున్నారు. ఈ మేరకు రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత బోడపాటి సుబ్బలక్ష్మి చైర్ పర్సన్ గా, కోనేటి రామకృష్ణ వైస్ చైర్మన్ గా మార్పులు జరిగాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ పెను మార్పులు జరిగాయి. మాజీ చైర్ పర్సన్ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్ శెట్టి విజయాంబ వైసీపీని వీడి, టిడిపి గూటికి చేరుకున్నారు. వైసిపి హయాంలోనే నర్సీపట్నంలో ఉన్న మున్సిపల్ కార్యాలయం పెద్ద బొడ్డేపల్లికి మార్చడం జరిగింది. తాజాగా నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. నేటితో పదవీకాలం పూర్తి కావడంతో కౌన్సిలర్లు అందరూ తాజా మాజీలు అయ్యారు. రేపటి నుండి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నర్సీపట్నం ఆర్డిఓ వి.వి. రమణను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి ఇప్పటికే సంకేతాలు ఇవ్వడంతో, నర్సీపట్నంలో మున్సిపాలిటీకి జరిగే మూడవ దశ ఎన్నికలపై రెండు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ ఎన్నికలకు మున్సిపాలిటీలో మరో మూడు వార్డులు పెరుగుతాయని చర్చ జరుగుతుంది. అయితే చైర్ పర్సన్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో అనే అంశం ఆశక్తి కరం. సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం కు అనుకూలంగా ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో టిడిపి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించి, వార్డు నాయకులపై ఒక సర్వే నిర్వహించినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular