ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పీఎన్‌జీకి మారితే లాభాలే లాభాలు

పీఎన్‌జీకి మారితే లాభాలే లాభాలు

📰 Generate e-Paper Clip

  • పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు
  • దీపం పథకం లబ్ధిదారులకు రూ.2400 నగదు ప్రయోజనం
  • ప్రధాన నగరాల్లో పీఎన్‌జీ విస్తరణకు కార్యాచరణ
  • అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలకు వేగవంతమైన కనెక్షన్లు
  • గ్యాస్ కొరతపై వదంతులను ఖండించిన ప్రభుత్వం
  • పీఎన్‌జీకి మారితే లాభాలే లాభాలు: ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం
  • ఎల్పీజీకి ప్రత్యామ్నాయం పీఎన్‌జీ: సబ్సిడీలతో ముందుకు ఏపీ
  • పీఎన్ జీ వాడితే లాభం, ఆదాయం ప్రమోషన్ ప్రారంభించిన ఏపీ సర్కార్

న్యూస్ డెస్క్ పెన్ పవర్ మార్చ్ 28:

అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావంతో ముడిచమురుతో పాటు ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అవాంతరాలు తలెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ కనెక్షన్ల నుంచి పీఎన్‌జీ కనెక్షన్లకు మారేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా వారికి సబ్సిడీ బెనిఫిట్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. PNG కనెక్షన్‌కు మారినప్పటికీ లబ్ధిదారులకు దీపం పథకం వర్తింపజేసి నగదు వారి ఖాతాల్లో రూ.2400 జమచేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పీఎన్‌జీ కనెక్షన్‌కు మారుతున్నందుకు కేంద్రం ఇచ్చే రూ.500 రాయితీ కూడా లభించనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న నెల రోజుల్లో లక్షకు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులను పీఎన్జీ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఈ నగరాల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సౌకర్యాన్ని వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారుప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం దేవస్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లకు కూడా PNG కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, పారిశ్రామిక యూనిట్లకు కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ఇందుకోసం ‘ఆటోమేటిక్ పర్మిషన్ సిస్టమ్’ను తీసుకువస్తామని స్పష్టం చేశారు.గత ప్రభుత్వ హయాంలో జీఎస్టీని 5 శాతం నుండి 25 శాతానికి పెంచడం వల్లే పీఎన్జీపై ప్రజలు ఆసక్తి చూపలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇకపై ‘దీపం’ పథకం కింద ఇచ్చే సబ్సిడీని పీఎన్జీ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. PNG వినియోగదారులకు నిబంధనల మేరకు 2 నెలలకు ఒకసారి సబ్సిడీ ప్రయోజనం అందే విధంగా మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు సమానమైన రూ. 2400 నగదును పీఎన్జీ వినియోగదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా జమ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 94 లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ కొరత వార్తలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రతిరోజూ సుమారు 2.70 లక్షల నుండి 2.80 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వదంతుల కారణంగా ప్రజలు అనవసరంగా గ్యాస్ బుక్ చేయడంతో కొంత ఒత్తిడి పెరిగిందని, ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందని ఆయన వివరించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడినా లేదా అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ కూడా పాల్గొన్నారు.

 

🚫 గ్యాస్ కొరత లేదు – వదంతులను నమ్మొద్దు!

👉 ఇప్పుడే PNG వైపు మారండి – ఖర్చు తగ్గించండి, సురక్షితంగా ఉండండి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular