చింతూరు, పెన్ పవర్ మార్చి 24: ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా సంస్థ మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చింతూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తులసీపాక వైద్యాధికారి డాక్టర్ ఉదయ్ కుమార్ పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఉప వైద్య ఆరోగ్య అధికారుల కార్యాలయం నుండి మెడికల్ కాలనీ, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం, చింతూరు ప్రధాన కేంద్రం మీదుగా తిరిగి ఉప కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో విద్యార్థులు క్షయవ్యాధి లక్షణాలు, వ్యాప్తి కారణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ క్షయవ్యాధి అంతం మన పంతం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, ఆకలి తగ్గడం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి పరీక్షలు చేయించి చికిత్స ప్రారంభించాలని సూచించారు. అలాగే సమాజం నుండి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జనవరి 2026 నుండి ఇప్పటి వరకు విభాగ పరిధిలో 41 క్షయవ్యాధి కేసులు నమోదయ్యాయని తెలిపారు. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం కేంద్ర ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థకు చెందిన అహ్మద్ అలీ, సీనియర్ చికిత్స పర్యవేక్షకుడు ఆర్. రామాంజనేయులు, బహుళ ప్రజారోగ్య విస్తరణ అధికారి రాంప్రసాద్, తులసీపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆరోగ్య సహాయకులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
RELATED ARTICLES



