రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 24:
రామచంద్రపురం మండలంలోని పెద్ద తాళ్లపాలెం రోడ్డువద్ద జరిగిన విషాద ఘటనలో విద్యుత్ షాక్ కారణంగా ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.విద్యుత్ వైర్లపై పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ ప్రవహించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు దాసరి సూర్యప్రకాశ్ (21)గా గుర్తించారు. ఆయన కృష్ణా జిల్లా నుంచి ఉపాధి కోసం వలస వచ్చి విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పనుల మధ్యలో విద్యుత్ వైర్లపై పడిపోవడంతో తీవ్రంగా షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టినా, సూర్యప్రకాశ్‌ను రక్షించలేకపోయారు. గాయపడిన వారిలో ఒకరు విద్యుత్ స్తంభం నుంచి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, ఇద్దరినీ హుటాహుటిన రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, మెయిన్ ఆఫ్ చేసి పనులు చేస్తున్నప్పటికీ విద్యుత్ ఎలా ప్రవహించింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన తండ్రి సత్యంతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్‌మన్ పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఘటనపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని మంత్రి హెచ్చరిక చేశారు.విద్యుత్ అధికారులపై మంత్రి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే దాక్షారామం, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రిపోర్టర్ వివరాలు
పేరు: YEDUKONDALU DADALAహోదా: STAFF REPORTER
ప్రాంతం: KAKINADA DIST



