ePaper
Thursday, March 26, 2026
ads
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రకాశంమార్కాపురం బస్సు ప్రమాదంలో అంకభూపాలపురం మహిళ మృతి

మార్కాపురం బస్సు ప్రమాదంలో అంకభూపాలపురం మహిళ మృతి

📰 Generate e-Paper Clip

సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

వలేటివారిపాలెం,పెన్ పవర్ మార్చి 26 :

మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో స్థానిక వలేటివారిపాలెం మండలంలోని అంకభూపాలపురం గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. ఆమెను బండారు పద్మ (25)గా గుర్తించారు. అంక భూపాలపురం గ్రామానికి చెందిన బండారు పద్మ, బత్తుల మణెమ్మ సహా పలు కుటుంబాలు… తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నిర్మల్ సమీపంలో స్థిరపడ్డారు. వీరంతా అక్కడ బేల్దారి పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండారు పద్మ, బత్తుల మణెమ్మ, 10 సంవత్సరాల వయసున్న బండారు రోహన్ లు సొంతూరు వెళ్లేందుకు బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి కనిగిరికి బస్సులో బయలుదేరారు. బస్సు ప్రమాదానికి గురై మంటలు చెలరేగాక బత్తుల మణెమ్మ వెంటనే స్పందించి, పక్కనే కూర్చున్న రోహన్ ను కిటికీలోనుంచి బయటకు విసిరేసింది. తరువాత మణెమ్మ కూడా ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడింది. కానీ బండారు పద్మ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. కాగా పద్మకు భర్త గోవిందరాజులు, 12 సంవత్సరాల వయసున్న కుమారుడు, పది సంవత్సరాల వయసున్న కుమార్తె ఉన్నారు. రోహన్ తల, చెవులు, ముక్కు, కాలుకు స్వల్ప గాయాలయ్యాయి. మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బత్తుల మణెమ్మ కుడి చెయ్యి విరగడంతో పాటు కిడ్నీకి తీవ్ర గాయం అయింది. ఆపరేషన్ కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వారి బంధువులందరూ మార్కాపురం చేరుకున్నారు. కాగా బత్తుల పద్మ అకాల మరణం పట్ల, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. పద్మ భర్త గోవిందరాజులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. అలాగే రోహన్ తల్లిదండ్రులు, మణెమ్మ, రత్తమ్మ కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురి ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular