దుండిగల్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాల పర్వం..*
-బహుదూర్‌పల్లిలో భారీ షెడ్డు-డి.పోచంపల్లి సర్వే నెం.128లో అక్రమ షెడ్లకు..!*
-టౌన్‌ప్లానింగ్ అధికారుల సమిష్టి సహకారంతో యధేచ్చగా పనులు..!
-అధికారులను మించిన నూతన చైన్మెన్లు.. ‘నో’ రెస్పాన్స్’..!
-విధుల పట్ల అవగాహన కల్పించక పోయినా..! అక్రమార్కులకు సహకారం..!
*అధికారపార్టీ యువ నాయకుడికి..! టౌన్‌ప్లానింగ్ బానిసత్వంమా..?*
దుండిగల్ సర్కిల్లో అక్రమ కట్టడాలపై.. సిఫార్సుల మాటున విధులు తాకట్టు..?
చట్టాన్ని అమలు చేయాల్సిన టౌన్‌ప్లానింగ్ అధికారులు అమ్ముడు పోతున్నారా..?
బాధ్యతాయుతమైన విధులను వసూళ్ళకే పరిమితం చేస్తున్నారని విమర్శలు..!
బహుదూర్‌పల్లిలో యధేచ్చగా 1500 గజాల అక్రమ షెడ్డు నిర్మాణం..!
చర్యలకు అడ్డుగా అధికారపార్టీ నాయకులు అంటున్న టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం..?
అధికారపార్టీ నేతల సిఫార్సులే శాసనంగా..! భావించి దుండిగల్ టౌన్‌ప్లానింగ్ అమలు..!
టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరు రోజు రోజుకు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది..! విధులు పక్కనపెట్టి, సిఫార్సులు అమలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అక్రమ కట్టడాలు పూర్తయ్యే వరకు, సహకరించడం, ఆ తర్వాత “నోటీసులు-సీజింగ్లు” డ్రామాతో వదిలేయడం అంతా టౌన్‌ప్లానింగ్ అధికారుల దిట భాగమేనని దుండిగల్ సర్కిల్ ‘సిఎంసి’ పరిధిలో అనుమతులున్నా- లేకున్నా వందకు వంద శాతం అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తాయి.. టిజి-బిపాస్ చట్టం అమలు కేవలం “నోటీసులు-సీజింగ్ల” వరకే పరిమితం అవుతున్నాయి.. ఆ తదుపరి ఘట్టానికి చేరుకునే లోపే, ఓవైపు నాయకుల సిఫార్సులు, మరోవైపు అధికారులను ప్రసన్నం చెసుకుంటే ఇక అంతే సంగతులు.. మెజారిటీతో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలకు, పరిపాలనా సౌలభ్యం కోసం, అధికార యంత్రాంగం, పాలకులకు అనుకూలంగా వ్యవహరించడం ఆచారంగా వస్తున్నదే..!కానీ దీనిని ఆసరాగా చేసుకుని పార్టీల కండువాలు కప్పుకున్న ప్రతి గల్లి నాయకులకు అధికారులపై పెత్తనం చెలాయించే అధికారాన్ని- అనధికారికంగా అప్పగించి, పాలుకులు అబాసుపాలు అవుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా “అధికారులు-అధికారపార్టీ నాయకుల” కలయికతో బరితెగింపు చర్యలు కొత్తేమి కాదు, నిత్యం ఎన్నో చూస్తున్నవే..!
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్,మార్చి 22:
దుండిగల్ సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లంపేట్, బౌరంపేట్, బహుదూర్‌పల్లి, గండిమైసమ్మలో వందలాది అక్రమ కట్టడాలకు, టౌన్‌ప్లానింగ్ అధికారులు బహిరంగంగానే సహకరిస్తున్న సంగతి తెలిసిందే.. వార్తలు వచ్చినా ఉన్నతాధికారుల పట్టించుకోకపోవడం గమనార్హం.. 
ఈ వ్యవహారంలో అధికారులు అందరూ వాటాదారులు అయినందునే నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అధికారపార్టీ యువనాయకుని సిఫార్సులకు డూడూ బసవన్నలా తలూపుతూ, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధులు, “అక్రమార్కులు- అధికారులు” పంచుకు తింటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అనుమతుల్లేని ప్రమాదకర అక్రమ నిర్మాణాలకు సహకరించేందుకు దుండిగల్ సర్కిల్ టౌన్‌ప్లానింగ్‌లో ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.. అక్రమ నిర్మాణాలు-షెడ్లపై ఎవరు ప్రశ్నించినా.. వాళ్ళకు “అన్నీ ఉన్నాయని” ఊతపదం సమాధానంగా చెప్పడం గమనార్హం..
టౌన్‌ప్లానింగ్ సౌజన్యంతో.. అక్రమ షెడ్లు దినదినాభివృద్ధి..?
దుండిగల్ సర్కిల్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో టిజి-బిపాస్ చట్టాన్ని పాతరేశారు.. నిబంధనలకు తిలోదకాలు పలికి, అధికారులు నిధులు సమకూర్చుకునే వేటలో భాగంగా అక్రమార్కులకు సహకరించడం పరిపాటిగా మారింది.. అందుకు బహుదూర్‌పల్లిలో భారీ అక్రమ షెడ్డు తోపాటు, దొమ్మర పోచంపల్లి సర్వే నెం.128లో అక్రమ షెడ్లు ఉదాహరణ.. వాటిపై చర్యలకు అధికారపార్టీ యువ నాయకుడు అడ్డు పడుతున్నట్టు బుకాయించడం విశేషం.. బహుదూర్‌పల్లిలో 1500 గజాల్లో అక్రమ షెడ్లు దినదినాభివృద్ధి చెందడమే ప్రత్యక్ష సాక్ష్యం.. మరోవైపు బహుదూర్‌పల్లిలో సీజ్ చేసిన అక్రమ నిర్మాణం లోపల పనులు చేస్తున్నట్టు సమాచారం.. దీంతో పాటు బహుదూర్‌పల్లి లోని బిల్డర్ సిద్దార్థ గుప్త అక్రమ నిర్మాణానికి నోటీసులిచ్చి 10 రోజులు గడిచాయి.. తదుపరి చర్యలు లేకుండా, యువ నాయకుని సిఫార్సులు ఉన్నట్టు సమాచారం.. దుండిగల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల జీవితకాలం విధులు పనికిమాలిన సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తుంటే..! చట్టాలను అమలు చేసేదెప్పుడు..? చర్యలు తీసుకునేది ఎప్పుడని పలువురు ఎద్దేవా చేస్తున్నారు..
పట్టణ ప్రణాళిక పనితీరు హాస్యాస్పదం..
అక్రమ నిర్మాణాలు చేపట్టే సమయంలో దుండిగల్ టౌన్‌ప్లానింగ్ నిద్రపోతున్నట్టు వ్యవహరించడం ఆనవాయితీ..! ఆ తర్వాత సెటిల్మెంట్ల ప్రక్రియ ముగించుకుని, నోటీసులు- సీజింగ్లే శాశ్వత చర్యలుగా నమ్మిస్తారు.. ఇదంతా అక్రమార్కులతో అధికారుల ఒప్పందంలో భాగమేనని పలువురు విమర్శిస్తున్నారు.. ఇప్పటి వరకు ఈ ఎనిమిదేళ్ళ దుండిగల్ సర్కిల్ ప్రస్తానంలో “నోటీసులు-సీజింగ్ల” అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన దాఖలాలు ఉన్నాయా..? టిజి-బిపాస్ చట్ట ప్రకారం ఏర్పాటు చేసిన “టాస్క్ ఫోర్స్ కమిటీ” చర్యలల్లో పాల్గొన్న సందర్భాలు ఉంటే చెపుతారా..? నిరూపించగలరా..? వీటిపై ప్రశ్నించాల్సిన పైఅధికారులు కూడా “బెల్లం కొట్టిన రాయిలా” పడి ఉండటం అనుమానాలను రెకెత్తిస్తుంది.. అధికారుల్లో పారదర్శకత కనుమరుగైంది.. అధికారమే అండగా అధికారులు బరితెగించి విధులు నిర్వర్తించడమే కారణంగా ఆరోపిస్తున్నారు..
చైన్మెన్ల నియామకం లోనూ అనుమానాలు..?
దుండిగల్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసిలో విలీనం..! పరిపాలనా సౌలభ్యం కోసం, విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగతున్న దుండిగల్ సర్కిల్-59 టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారుల తీరుపై విమర్శలు వస్తుండగా..! చైన్మెన్ల నియామకం లోనూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. పాత చైన్మెన్లను ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా శాఖల మార్పిడితో మార్పులు చేర్పులు చేసినప్పటికీ..! బిల్ కలెక్టర్లుగా ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బందినే మళ్ళీ చైన్మెన్లుగా నియామకంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..? అధికారుల స్వార్ధ పూరితమైన ఎంపికగా ప్రశ్నలు వెల్లువెత్తాయి.. “తెరముందు కొత్త చైన్మెన్లు”- తెరవెనుక పాత చైన్‌మెన్” లతోనే ఈ అక్రమ నిర్మాణాల దందా యధావిధిగా కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి..
కొత్త బిల్డింగ్ రూల్స్..! టిడిఆర్ తప్పనిసరి.. హై రైజ్‌లకు సడలింపులు..!
తెలంగాణలో భవన నిర్మాణ నియమావళిలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. నగరాలు వేగవంతమైన అభివృద్ధి, రోడ్ల విస్తరణ, ప్రణాళికాబద్ధ నిర్మాణాలకు అనుగుణంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టిడిఆర్) వినియోగాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.. ముఖ్యంగా హైరైజ్ నిర్మాణాలకు కొత్త నిర్వచనం సూచిస్తుంది.. ఇకపై 21 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న భవనాలను అధికారికంగా హై రైజ్‌గా గుర్తించనున్నారు. 750 నుంచి 2000 చదరపు మీటర్ల మధ్య ప్లాట్లలో 18–21 మీటర్ల భవనాలకు టిడిఆర్ వినియోగం తప్పనిసరి చేయడం గమనార్హం..
సెట్బ్యాక్లపైనా సడలింపులు..
నాన్ హైరైజ్ భవనాలకు సెట్‌బ్యాక్‌ల్లో కొంత సడలింపు ఇవ్వగా, హై రైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి ఇచ్చింది.. దీంతోపాటు అదనపు అంతస్తులకు గ్రీన్ సిగ్నల్.. 2000 చ.మీ. పైగా విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో అదనపు అంతస్తుల నిర్మాణానికి అవకాశం కల్పించింది. రోడ్డు వెడల్పు ఆధారంగా: 40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులు.. 60 ఫీట్ రోడ్ వద్ద 4 అదనపు అంతస్తులు.. 80 ఫీట్ రోడ్ వద్ద 5 అదనపు అంతస్తులకు టిడిఆర్‌పై కఠిన నిబంధనలు పొందుపరిచారు.. 10 అంతస్తులపైగా ఉన్న భవనాల్లో ‘టిడిఆర్’ వినియోగం తప్పనిసరి కాగా, 20 అంతస్తులకుపైగా ఉన్న భవనాలకు 5 శాతం ‘టిడిఆర్’ లోడింగ్ విధించింది.. అలాగే, బిల్డింగ్ అనుమతి సమయంలో 50 శాతం టిడిఆర్ సమర్పించాల్సి ఉండగా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగిలిన 50 శాతం చెల్లించాలని తప్పనిసరి చేసింది.. ఈ మార్పులతో నగరాల్లో నియంత్రిత నిర్మాణాలు, ప్రభుత్వానికి భూముల సమీకరణ సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, కొత్త నిబంధనలు డెవలపర్లపై ఆర్థిక భారం పెంచే అవకాశముందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి..



