ePaper
Monday, March 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంవరదలపై ముందస్తు ముమ్మర చర్యలు మూడు నెలల రేషన్ సిద్ధం

వరదలపై ముందస్తు ముమ్మర చర్యలు మూడు నెలల రేషన్ సిద్ధం

📰 Generate e-Paper Clip

చింతూరు, పెన్ పవర్ మార్చి 29:

ఈ సంవత్సరం సంభవించే వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఆదివారం చింతూరులోని ఐటీడీఏ సమావేశపు హాలులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల ఇంజనీర్లు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదలు ఎప్పుడైనా వచ్చినా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ముందుగానే సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ముందుగానే నిల్వ ఉంచుతున్నామని తెలిపారు. అలాగే లాంచీలు, కంట్రీ బోట్లు, ఆయిల్ తదితర అవసరమైన సామగ్రిని కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గతంలో వరదల సమయంలో చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, భద్రాచలం ప్రాంతంలో వరద హెచ్చరికలు వచ్చిన వెంటనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై వివరాలు సేకరించారు. అదేవిధంగా, పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలను వచ్చే ఏడాదిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీవో జనరల్ రామతులసి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆంజనేయులు, వై. వెంకటేశ్వర్లు, బాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, పిహెచ్‌ఓ ముత్తయ్య, సిడిపిఓ జయలక్ష్మి, ఏవో కే. సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మురళి, రత్నరాజు, డిఇలు సూర్యప్రకాశ్, ఆశ్రిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular