ePaper
Saturday, March 21, 2026
spot_img
ePaper
Homeజాతియంవిశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం క్లియర్ సిగ్నల్

విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం క్లియర్ సిగ్నల్

Center gives clear signal to Visakhapatnam railway zone

📰 Generate e-Paper Clip

  • వడివడిగా రైల్వే జోన్ అడుగులు
  • లోక్‌సభలో ప్రకటన చేసిన అశ్విని వైష్ణవ్
  • ముడసర్లోవలో భూమి స్వాధీనం పూర్తి
  • రూ.106 కోట్లతో హెడ్‌క్వార్టర్స్ నిర్మాణం వేగం
  • తాత్కాలిక కార్యాలయం ‘ది డెక్’లో సిద్ధం
  • జీఎం సహా ఉన్నతాధికారుల నియామకం పూర్తి
  • ఏపీకి రికార్డు స్థాయి రైల్వే బడ్జెట్ కేటాయింపు
  • 39 ప్రాజెక్టులతో భారీ మౌలిక సదుపాయాల విస్తరణ
  • అమరావతి కనెక్టివిటీకి కొత్త రైల్వే లైన్
  • రవాణా, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపిరిఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కల సాకారం అవుతోంది. సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో ఏర్పడిన ఈ జోన్ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విశాఖపట్టణం, పెన్ పవర్ మార్చి 21:

ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల అయిన విశాఖపట్నం రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే – SCoR కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో ప్రధానమైన ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని, విశాఖలోని ముడసర్లోవ వద్ద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల భూమిని రైల్వే శాఖ స్వాధీనం చేసుకుందని ఆయన వెల్లడించారురైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 106.89 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికే పునాది పనులు పూర్తయ్యాయి.

2025 జనవరిలోనే ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన జరిగింది. అయితే, భవన నిర్మాణం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, తక్షణమే పాలన సాగించేందుకు వీలుగా విశాఖలోనిభవనం ది డెక్ ను సిద్ధం చేశారు. త్వరలోనే ఇక్కడి నుండే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి జనరల్ మేనేజర్ ,ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ కూడా పూర్తయినట్లు మంత్రి స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే కేటాయింపుల విషయంలో కేంద్రం రికార్డు స్థాయి నిధులు కేటాయిస్తోంది. 2009-14 మధ్య కాలంలో ఏటా సగటున రూ. 886 కోట్లు మాత్రమే ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీకి ఏకంగా రూ. 9,417 కోట్లు కేటాయించడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 70,232 కోట్ల విలువైన 39 రైల్వే ప్రాజెక్టులు కొత్త లైన్లు , డబ్లింగ్ పనులతో కలిపి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. గతంతో పోలిస్తే ట్రాక్ నిర్మాణ వేగం రెట్టింపైందని, ఏటా సగటున 143 కి.మీల మేర కొత్త ట్రాక్ పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే, అమరావతి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 57 కి.మీల కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2047 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అలాగే విజయవాడ-గూడూరు మూడవ లైన్, గుంతకల్-గుంటూరు డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే ఏపీలో రైలు ప్రయాణం మరింత వేగవంతం కావడమే కాకుండా రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొన్నారు.మొత్తానికి, విశాఖ రైల్వే జోన్ కార్యరూపం దాల్చడం మరియు భారీ స్థాయిలో నిధుల కేటాయింపులు జరగడం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేయనుంది. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రైల్వే శాఖ చేపట్టిన ఈ చర్యలు రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. త్వరలోనే విశాఖ నుంచి జోన్ పాలన ప్రారంభం కానుండటం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular