– ప్రత్యేక అధికారుల నియామకానికి సిద్ధం
కాజులూరు, పెన్ పవర్, మార్చి 26:
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 2తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చెల్లింపుల అధికారాలపై ఆంక్షలు విధించింది.బుధవారం నుంచి సర్పంచ్‌లు నేరుగా చెల్లింపులు చేసే అవకాశం నిలిపివేయబడింది. ఇకపై జీతాలు వంటి అత్యవసర ఖర్చులు చేయాల్సి వచ్చినప్పుడు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డిడిఓ) అనుమతి తప్పనిసరి.ఇప్పటివరకు సిఎఫ్‌ఎమ్‌ఎస్ ద్వారా సర్పంచ్‌లు బిల్లులకు థంబ్ వేస్తే అవి నేరుగా ట్రెజరీకి వెళ్లేవి. కానీ తాజా మార్పులతో, బిల్లులు ముందుగా డిడిఓ లాగిన్‌కు వెళ్లి, ఆయన పరిశీలించి ఆమోదించిన తర్వాత మాత్రమే ట్రెజరీకి చేరే విధానం అమల్లోకి వచ్చింది.ఈ విషయంపై పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యదర్శులు, సర్పంచ్‌లు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చెక్ బుక్‌లను స్వాధీనం చేసుకునే విధానం ఉండగా, ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలోనే ఈ నియంత్రణలు అమలు చేస్తున్నారు.ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు
సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఏప్రిల్ 3 నుంచి గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండలాల వారీగా ప్రత్యేక అధికారుల జాబితాలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు పంపించేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.ప్రత్యేక అధికారులుగా తాసిల్దార్, ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంఈఓలు, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ శాఖ అధికారులు, మండల పరిషత్ పరిపాలనాధికారులను నియమించే అవకాశముంది. అయితే ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఈ బాధ్యతలకు నియమించడంపై నిబంధనల పరిమితులు ఉన్నాయి, ఎందుకంటే వారు పనుల అంచనాలు, మెజర్‌మెంట్ బాధ్యతలు నిర్వహిస్తారు.గ్రామ పంచాయతీల సంఖ్య అధికంగా ఉన్న మండలాల్లో రెండు లేదా మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం ఉంది. అయితే గ్రామ స్థాయి పరిపాలనపై అవగాహన కొరత, చెల్లింపుల విషయంలో జాగ్రత్త అవసరం వంటి కారణాలతో కొందరు అధికారులు ఈ బాధ్యతలపై ఆసక్తి చూపడం లేదని సమాచారం.
జిల్లాల వారీ పంచాయతీల వివరాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,069 గ్రామ పంచాయతీలు ఉండగా, జిల్లాల విభజన అనంతరం:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో – 342
కాకినాడ జిల్లాలో – 385
తూర్పుగోదావరి జిల్లాలో – 342
గ్రామ పంచాయతీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, నిధుల వినియోగంపై నియంత్రణ సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పరిపాలనలో కీలక మార్పులకు దారితీయనుంది.


