భక్తులతో కిటకిటలాడిన జాతర
కాజులూరు, ఏప్రిల్ 9: మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో గురువారం గ్రామదేవత ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు పలు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
గొల్లపాలెం–కొంగోడు గ్రామాల సరిహద్దులో, కాకినాడ–కోటిపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ధనమ్మ తల్లి ఆలయం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. కరప, కాజులూరు మండలాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ప్రతి ఏడాది పౌర్ణమి అనంతరం గురువారం నిర్వహించే ఈ తీర్థ మహోత్సవం స్థానికంగా విశేషంగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి, భారీ లైటింగ్, ఆర్కెస్ట్రా కార్యక్రమాలతో ఉత్సవాలకు మరింత శోభ తీసుకువచ్చారు. రాత్రి వేళల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగడం విశేషం. ముఖ్యంగా సంతానం కోసం కోరుకునే దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా ఉంది.వేకువజాము నుంచే భక్తులు యూ-లైన్లో నిలబడి దర్శనానికి పోటెత్తారు. గొల్లపాలెం గ్రామంలో ధనమ్మ తల్లి ఆలయం అత్యంత విశ్వాసాన్ని కలిగిన దైవంగా భక్తుల నమ్మకం.ఆలయ చరిత్ర:
సుమారు రెండు శతాబ్దాల క్రితం ఒక భక్తురాలు అనాధ శిశువును కాపాడి, తల్లిలా పెంచిన నిస్వార్థ సేవకు గుర్తింపుగా గ్రామస్థులు ఆమెను “ధనమ్మ తల్లి”గా ఆరాధించడం ప్రారంభించారు. అనంతరం ఆమె సమాధి స్థలంలో ఆలయం నిర్మించి పూజలు కొనసాగిస్తున్నారు. సంతానం లేని దంపతులకు అమ్మవారి ఆశీస్సులతో సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.పోలీసుల పటిష్ట బందోబస్తు:ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం. మోహన్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంగోడు ముఖద్వారం నుంచి బస్సులను కొంగోడు గ్రామం మీదుగా గొల్లపాలెం పోలీస్ స్టేషన్ మార్గంగా మళ్లించారు. అలాగే ద్రాక్షారామం, ఆర్యవటం, గొల్లపాలెం వైపు నుంచి వచ్చే వాహనాలను కొంగోడు–గొర్రెపూడి మార్గంలో దారి మళ్లిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతో జాతర సాఫీగా కొనసాగింది. అలాగే ధనమ్మ తల్లి మహోత్సవాన్ని పురస్కరించుకొని గొల్లపాలెం తిరుమల ఫంక్షన్ హాల్ వద్ద
భక్తులకు బంధనపూడి గ్రామ సర్పంచ్ డేగల తిరుమల వేణి, జనసేన యువనేత డేగల నాగేంద్ర కుటుంబ సభ్యులు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

