ePaper
Friday, April 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చిన్న కండ్లేరు చెరువుకు మొండిచేయి..!

చిన్న కండ్లేరు చెరువుకు మొండిచేయి..!

మర్మత్తుల మాటే మరిచిపోయిన కూటమి ప్రభుత్వం

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 8

పుల్లల చెరువు మండల రైతుల గుండెల్లో నిండిన ఆవేదన ఇప్పుడు ఆగ్రహంగా మారుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన చిన్న కండ్లేరు చెరువు నేడు నిర్లక్ష్యానికి బలైపోయింది. చెరువుల పునరుద్ధరణ పేరుతో కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్టు ప్రకటనలు చేసిన ప్రభుత్వం, చిన్న కండ్లేరు చెరువుకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవటంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

*చెరువు బాగుంటేనే మా బతుకు బాగుంటాయి*

రైతుల ఆశలు ఇప్పుడు ఆవిరైపోతున్నాయి. ఎన్నికల సమయంలో చెరువుల పునరుద్ధరణపై హామీల వర్షం కురిపించిన నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలను పూర్తిగా మరిచిపోయినట్టుగా కనిపిస్తున్నారు.ఒకప్పుడు వానలు పడగానే నిండిపోయి, వందల ఎకరాల పంటలకు నీరందించిన చిన్న కండ్లేరు చెరువు ప్రస్తుతం గండ్లు పడి, నీరు నిలవని గుంటగా మారిపోయింది.వర్షం వచ్చినా నీరు చేరుతుంది గానీ నిలవదు.చెరువులో పాడైపోయిన బండలు, మూసుకుపోయిన కాలువలు, చీలిపోయిన గట్టులు ఇవే నేటి దయనీయ పరిస్థితికి నిదర్శనం.ప్రతి ఏడాది ఇదే సమస్య పునరావృతమవుతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.చెరువు పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప, దాని అభివృద్ధికి ఒక్క అడుగు కూడా వేయలేదని రైతులు మండిపడుతున్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి? అని ప్రశ్నిస్తున్నారు.ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పథకాల్లో చిన్న కండ్లేరు చెరువుకు చోటే దక్కలేదు. దీంతో మా చెరువు ఏమాత్రం ప్రాధాన్యం లేనిదా? అని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి సంవత్సరం మంచి వర్షపాతం ఉన్నా, చెరువులో నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వల్ల విలువైన నీరు వృథాగా పోతోంది. ఫలితంగా భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. బోర్లు వేయడానికి రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసినా, నీరు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్థానిక ప్రజాప్రతినిధుల మౌనం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.సమస్య తెలిసినా ఎందుకు స్పందించడం లేదు? అధికారులను ఎందుకు ప్రశ్నించడం లేదు? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.కాగితాలపై పథకాలు, సభల్లో హామీలు ఇవి తప్ప చేతల్లో చర్యలు కనిపించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల మాటల్లోనే అసలు నిజం దాగి ఉంది:
*చెరువు బాగుంటే పంట బాగుంటుంది…*

పంట బాగుంటే మా బతుకు బాగుంటుంది.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి చిన్న కండ్లేరు చెరువును మర్మత్తుల జాబితాలో చేర్చి, వెంటనే పనులు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ నిర్లక్ష్యం రైతుల ఆవేదనను ఆగ్రహంగా మార్చి, పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారి తీసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular