చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 03:
చిలకలూరిపేట : తెనాలి మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి శాసనమండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ అమరావతికి మద్దతుగా నిలవాలని, గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసిన వైసీపీ నాయకులు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.
లోక్‌సభ, రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో రాజ్యాంగపరంగా అమరావతే శాశ్వత రాజధానిగా నిలిచిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విశ్వాసంతో అమరావతి ప్రాంత రైతులు 30 వేల ఎకరాలకు పైగా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారని గుర్తుచేశారు. ఆ రైతుల త్యాగ ఫలితంగా అమరావతిని కూటమి ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ వైఖరిని మార్చుకోలేదని విమర్శిస్తూ, అమరావతి పేరు చెప్పడానికే వెనుకాడుతున్నారని, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నం చేశారని అన్నారు. పార్లమెంట్ దేశానికి అత్యున్నత సంస్థగా చట్టాలు రూపొందిస్తుందని, అలాంటి చట్టంతో అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రతిపక్ష నాయకులు అమరావతిని అంగీకరించాలని కోరారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హర్షధ్వానాల మధ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేలాది మంది రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యాండిల్స్ వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు, ఉభయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యుడు పేరాబత్తిన రాజశేఖర్, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రణం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

