ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
– జేసీ అపూర్వ భరత్
కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 06:
జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు.సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో జేసీ అపూర్వ భరత్, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, సీపీవో పీ. త్రినాథ్, డీఆర్డీఏ పీడీ జి. శ్రీనివాసు, డీఎల్డీవో వాసుదేవరావు తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా మొత్తం 396 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి తగిన పరిష్కారం అందించాలని జేసీ ఆదేశించారు. బియ్యం కార్డుల మంజూరు, పేర్ల మార్పులు, పింఛన్లు, ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైనేజీ పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, అందిన ప్రతి అర్జీపై అధికారులు ప్రాధాన్యతతో స్పందించి అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం అందించాలని సూచించారు. రీ-ఓపెన్ చేసిన అర్జీలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి తగిన సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. శాఖల వారీగా పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.
రెవెన్యూ క్లినిక్‌కు 10 అర్జీలు
రెవెన్యూ శాఖ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం కూడా ఇదే వేదికలో జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డా. టి. తిప్పే నాయక్, కెఆర్ఆర్సీ ఎస్డీసీ జి. రత్నమణి, సర్వే అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రీ-సర్వే, భూముల వివరాల ఆన్‌లైన్ నమోదు, జాయింట్ ఎల్పీఎంలు, 22ఏ భూములు,సర్వే నెంబర్లకు సంబంధించిన సమస్యలపై మొత్తం 10 అర్జీలు అందినట్లు డీఆర్వో తెలిపారు.
అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి తిప్పే నాయక్ రెవెన్యూ డివిజన్ అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించి అర్జీలను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు,తహశీల్దార్లు,సర్వే అధికారులు పాల్గొన్నారు.


