రంపచోడవరం, పెన్ పవర్: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ విధానంపై సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే నిధులతో అమలు చేసే సంక్షేమ పథకాలను రాజకీయ పార్టీల ప్రచార వేదికలుగా మార్చడం అనర్హమని విమర్శించింది.సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు, రంపచోడవరం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీ అనేది పూర్తిగా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని పేర్కొన్నారు. అలాంటి కార్యక్రమాల్లో రాజకీయ నాయకుల జోక్యం అనవసరమని, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు పెత్తనం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.నిబంధనల ప్రకారం సచివాలయ సిబ్బంది లేదా సంబంధిత అధికారులు పర్యవేక్షణలోనే పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియను పార్టీ కార్యకర్తలకు అప్పగించడం అధికార యంత్రాంగం వైఫల్యాన్ని సూచిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పథకాలకు పార్టీల రంగులు పులమడం సరైంది కాదని, ఇది ఇతర రాజకీయ పార్టీల ఉనికిని కూడా దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఎ అధికారులు వెంటనే స్పందించి, రాజకీయ జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ సిబ్బంది ద్వారానే పెన్షన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను చైతన్యపరిచి సిపిఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కంభం శాంతి రాజు, ఈతపల్లి సిరిమల్లి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

