ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్వైసీపీ కొత్త గేమ్ ప్లాన్

వైసీపీ కొత్త గేమ్ ప్లాన్

📰 Generate e-Paper Clip

  • అసెంబ్లీకి దూరం.. మండలి, పార్లమెంట్‌లతో కూటమిపై డ్యూయల్ స్ట్రాటజీ
  • మండలిలో మెజారిటీ బలంతో ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లోకి నెట్టిన వైసీపీ
  • లడ్డూ వివాదం నుంచి రైతు సమస్యల దాకా మండలిలో దూకుడు
  • ఢిల్లీ వేదికగా రాష్ట్ర అంశాలపై ఎంపీలతో జాతీయ ఒత్తిడి
  • ఉనికి చాటుకోవడమే లక్ష్యంగా జగన్ పక్కా గేమ్ ప్లాన్

విజయవాడ, పెన్ పవర్ ఏప్రిల్ 1:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పోరాటం మొదలైంది. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినా, అధికార కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర స్థాయిలో శాసనమండలిని, జాతీయ స్థాయిలో పార్లమెంటును వేదికలుగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే ఈ కొత్త గేమ్ ప్లాన్ అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.అసెంబ్లీలో వైసీపీ బలం తక్కువగా ఉండటంతో, సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది వైసీపీ. అయితే శాసనమండలిని మాత్రం వదులుకోవడం లేదు. మండలిలో వైసీపీకి మెజారిటీ ఉండటాన్ని పూర్తిస్థాయిలో అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవల 15 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రతిరోజూ ప్రభుత్వాన్ని నిలదీశారు.ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం, టీటీడీ నిర్ణయాలు, రైతుల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ భర్తీ వంటి అంశాలపై వైసీపీ గట్టిగా పోరాడింది. లడ్డూ వివాదంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టి, వరుసగా వాయిదా తీర్మానాలు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. చివరకు ప్రభుత్వం పూర్తిస్థాయి చర్చకు సిద్ధం కాకపోయినా, కనీసం స్టేట్‌మెంట్ ఇచ్చేలా చేయగలిగింది. దీన్ని వైసీపీ నేతలు తమ నైతిక విజయంగా చెప్పుకుంటున్నారు. మండలిలో ఉన్న బలాన్ని వాడుకుంటూ అధికార పక్షాన్ని సమాధానం చెప్పాల్సిన పరిస్థితికి నెట్టడంలో వారు సఫలమవుతున్నారు.అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో పార్లమెంట్ వేదికను వైసీపీ వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గళం విప్పుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దాడులు, శాంతిభద్రతల సమస్యలు, అమరావతి అప్పుల అంశాలను వారు ఢిల్లీ వేదికగా ఎండగడుతున్నారు.ఈ వ్యూహంలో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధుల వెసులుబాటు కల్పించడంలో వైసీపీ చేసిన పోరాటం ఫలితాన్ని ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి తిరిగి అనుమతులు ఇవ్వడం తమ విజయమేనని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.అసెంబ్లీని స్కిప్ చేసినా.. మండలి, పార్లమెంట్ ద్వారా తమ వాయిస్‌ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఒకవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీలు, మరోవైపు ఢిల్లీలో ఎంపీలు సమాంతరంగా పోరాటం చేస్తుండటంతో కూటమి సర్కార్ రక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ డ్యూయల్ స్ట్రాటజీ ద్వారా వైసీపీ తన ఉనికిని చాటుకోవడమే కాకుండా, కూటమి వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచగలుగుతోంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular