ఇరాన్‌కు వ్యతిరేకంగా మరింత దీర్ఘదూర క్షిపణులను వినియోగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఎజిఎం-158 జాసమ్ క్షిపణులు 930 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. శత్రు రాడార్లను తప్పించుకుని అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడం వీటి ప్రత్యేకత. పైలట్ల భద్రతను కాపాడుతూ శత్రు వైమానిక రక్షణ పరిధికి వెలుపల నుంచే దాడి చేయొచ్చు. ఈ క్షిపణుల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్ చర్యలు ప్రారంభించింది.
- ఇరాన్‌పై అమెరికా కొత్త క్షిపణి వ్యూహం
- 930 కిమీ దూర లక్ష్యాలను ఛేదించే జాసమ్ శక్తి
- రాడార్లను మోసం చేసే అధునాతన సాంకేతికత
- యుద్ధ విమానాలు, బాంబర్లకు కీలక ఆయుధం
- లాక్‌హీడ్ మార్టిన్ ఉత్పత్తి వేగవంతం
న్యూస్ డెస్క్ | పెన్ పవర్ | ఏప్రిల్ 05:
ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా తన దీర్ఘదూర క్షిపణి సామర్థ్యాన్ని వినియోగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎజిఎం-158 కోడ్ పేరుతో ఉన్న జాయింట్ ఎయిర్ టు సర్ఫెస్ స్టాండాఫ్ మిసైల్ (జాసమ్)లను ఇరాన్‌పై వినియోగించేందుకు అమెరికా యోచిస్తున్నట్లు సమాచారం. లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఈ క్షిపణులు గత రెండు దశాబ్దాలుగా అమెరికా సైన్యంలో కీలక భాగంగా ఉన్నాయి. ఒక్కో క్షిపణి ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.12.5 కోట్లు). 500 నాటికల్ మైళ్లు, అంటే సుమారు 930 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే శక్తి వీటికి ఉంది. 1,000 పౌండ్ల బరువున్న శక్తివంతమైన వార్‌హెడ్‌తో కఠిన లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ఎఫ్-15ఇ, ఎఫ్-16 వంటి యుద్ధ విమానాలతో పాటు బి-1బి, బి-52హెచ్ వంటి భారీ బాంబర్ల నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. ఆధునిక ఇన్ఫ్రారెడ్ సీకర్, యాంటీ-జామ్ జీపీఎస్ సిస్టమ్‌తో శత్రు రాడార్లను తప్పించుకుని దాడి చేయగల సామర్థ్యం ఈ క్షిపణులకు ఉంది. ఇటీవల యుద్ధం ప్రారంభమైన నాలుగు వారాల్లోనే అమెరికా వెయ్యికి పైగా జాసమ్ క్షిపణులను వినియోగించినట్లు సమాచారం. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మరిన్ని క్షిపణులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తుండగా, ఉత్పత్తి వేగాన్ని పెంచేందుకు లాక్‌హీడ్ మార్టిన్ చర్యలు ప్రారంభించింది.

