దేవాదాయ శాఖలో ఒకప్పుడు అత్యంత ప్రభావశీల అధికారిగా పేరొందిన కళింగిరి శాంతి ప్రస్థానానికి ఏసీబీ భారీ షాక్ ఇచ్చింది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆమెను కోర్టు 14 రోజుల రిమాండ్కు పంపింది. కొద్ది ఏళ్ల సర్వీసులోనే అధికార దర్పం, వివాదాలు, రాజకీయ అండతో వార్తల్లో నిలిచిన ఆమె.. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో జైలు ఊచలు లెక్కిస్తోంది.ఈ ఘటన దేవాదాయ శాఖలో పారదర్శకత, బాధ్యతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.రాజకీయ అండ, అధికారం, అవినీతి కలిస్తే వ్యవస్థలు ఎలా దెబ్బతింటాయో ఈ ఉదంతం స్పష్టంగా చూపిస్తోంది.
- ఏసీబీ వలలో పవర్ ఫుల్ అధికారి
- నాలుగేళ్లలోనే వివాదాల కేంద్రబిందువు
- రాజకీయ అండతో పెరిగిన ప్రభావం
- ఆస్తుల కేసుతో రిమాండ్కు శాంతి
- వ్యవస్థలకు హెచ్చరికగా మారిన ఘటన
- అధికార దర్పానికి ఏసీబీ బ్రేక్.. శాంతి అరెస్ట్ సంచలనం
- దేవాదాయ శాఖలో కలకలం.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్
క్రైమ్ బ్యూరో పెన్ పవర్ విజయవాడ , ఏప్రిల్ 09:
దేవాదాయ శాఖలో ఒకప్పుడు అత్యంత ప్రభావశీల అధికారిగా గుర్తింపు పొందిన అసిస్టెంట్ కమిషనర్ కళింగిరి శాంతి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఇటీవల నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో ఆస్తుల వివరాలు బయటపడటంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.2020లో దేవాదాయ శాఖలో చేరిన శాంతి, తక్కువ కాలంలోనే శాఖలో ప్రభావవంతమైన అధికారిగా ఎదిగారు. రాజకీయ పరిచయాలు, ఉన్నత స్థాయి మద్దతుతో కీలక పోస్టుల్లో పనిచేస్తూ అధికార వ్యవస్థలో తనదైన ముద్ర వేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అయితే అదే సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగం, భూముల లీజులు, శాఖ నిర్ణయాల్లో జోక్యం వంటి పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.విశాఖలో పనిచేసిన సమయంలో శాఖకు చెందిన భూముల వ్యవహారాలు, కొన్ని లీజుల మంజూర్లు, పరిపాలనా తీరు వివాదాలకు దారితీశాయి. పై అధికారులతో ఘర్షణలు, శాఖలో అంతర్గత విభేదాలు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి. కోర్టు ఆదేశాల తర్వాత తిరిగి పోస్టింగ్ వచ్చిన కొద్ది రోజులకే ఏసీబీ దాడులు జరగడం, వెంటనే అరెస్ట్ వరకు వ్యవహారం వెళ్లడం మరింత చర్చకు కారణమైంది. ఈ ఘటన దేవాదాయ శాఖలో పరిపాలనా సంస్కరణలు, అవినీతి నిరోధక చర్యల అవసరాన్ని మరోసారి ముందుకు తెచ్చింది. రాజకీయ అండ, అధికార దర్పం తాత్కాలికంగా రక్షణ ఇచ్చినా.. చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదనే సందేశాన్ని ఈ కేసు బలంగా చాటిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

