ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కార్పొరేషన్లలో పెరుగుతున్న డివిజన్లు

కార్పొరేషన్లలో పెరుగుతున్న డివిజన్లు

ఏపీలో పట్టణ రాజకీయ సమీకరణాలను మార్చేలా కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను భారీగా పెంచింది.13 కార్పొరేషన్లలో మొత్తం 197 కొత్త వార్డులు చేరడంతో స్థానిక ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. జీవీఎంసీ 120 వార్డులతో రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్‌గా నిలవగా, విజయవాడ, గుంటూరు తదుపరి స్థానాల్లో నిలిచాయి.మునిసిపాలిటీలకూ ఇదే విధంగా విస్తరణ కొనసాగుతుండటంతో వేలాది ఆశావహులకు పోటీ అవకాశాలు పెరిగాయి.రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల్లో టికెట్ల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

  • జీవీఎంసీకి 120 వార్డులతో రాష్ట్రంలో టాప్ స్థానం
  • విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ భారీ పెంపు
  • 13 కార్పొరేషన్లలో మొత్తం 197 కొత్త వార్డులు
  • మునిసిపాలిటీలకూ విస్తరించిన వార్డుల పెంపు నిర్ణయం
  • స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలకు బంగారు అవకాశంవిశాఖపట్టణం | పెన్ పవర్ | ఏప్రిల్ 3:

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల రాజకీయ సమీకరణాలను మార్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను భారీగా పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఎదురుచూస్తున్న వేలాది ఆశావహులకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. ఈ మార్పులతో రాష్ట్రంలో అత్యధిక వార్డులు కలిగిన కార్పొరేషన్‌గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నిలిచింది. ఇక్కడ ఉన్న 98 వార్డులను 120కి పెంచారు. ఆ తర్వాత స్థానంలో విజయవాడ కార్పొరేషన్ 64 నుంచి 86 వార్డులకు చేరగా, గుంటూరు 57 నుంచి 76 వార్డులకు పెరిగింది.అలాగే నెల్లూరు 54 నుంచి 72, కర్నూల్ 52 నుంచి 68, తిరుపతి మరియు కడప 50 నుంచి 66 వార్డులకు పెరిగాయి. ఏలూరు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం కార్పొరేషన్లలో 50 నుంచి 62 వార్డులు చేశారు. చిత్తూరు, మచిలీపట్నం కార్పొరేషన్లలో 50 నుంచి 60 వార్డులకు పెంపు జరిగింది.మొత్తం 13 కార్పొరేషన్లలో కలిపి 197 కొత్త వార్డులు పెరగడం విశేషం. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీలలో కూడా వార్డుల సంఖ్య పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులకు తోడుగా మరో 20 నుంచి 25 శాతం అదనపు స్థానాలు ఏర్పడనున్నాయి. ప్రత్యేకంగా కూటమిలోని మూడు పార్టీలకు చెందిన స్థానిక నేతలు, ఆశావహులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్, చైర్‌పర్సన్ వంటి కీలక పదవుల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular