మహీంద్రా వాహనాలు కొనాలనుకునే వారికి కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 6 నుంచి SUVలు, కమర్షియల్ వాహనాల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి. సగటున మొత్తం పోర్ట్‌ఫోలియోపై 1.6% ధరల పెంపు ఉండనుందని సంస్థ ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహీంద్రా స్పష్టం చేసింది. మొదటి 40 వేల XUV 7XO బుకింగ్స్‌కు మాత్రం పాత ధరల రక్షణ కొనసాగనుంది.
ఏప్రిల్ 6 నుంచి మహీంద్రా ధరల మోత
SUVలు, CVలపై 2.5% వరకు పెంపు
ఇన్‌పుట్ ఖర్చులే కంపెనీ నిర్ణయానికి కారణం
XUV 7XO తొలి బుకింగ్స్‌కు ఊరట
కొనుగోలుదారుల్లో ముందస్తు బుకింగ్ హడావిడి
న్యూస్ డెస్క్ | పెన్ పవర్ | ఏప్రిల్ 03:
మహీంద్రా అండ్ మహీంద్రా తమ నాన్-ఎలక్ట్రిక్ SUVలు, కమర్షియల్ వాహనాల ధరలను ఏప్రిల్ 6 నుంచి పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా 2.5 శాతం వరకు ధరలు పెరగనున్నాయి, మొత్తం వాహన పోర్ట్‌ఫోలియోపై సగటు పెంపు 1.6 శాతం ఉండనుందని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయం పెరుగుతున్న ఉత్పత్తి, ముడిసరుకు, లాజిస్టిక్స్ వ్యయాల ప్రభావాన్ని కొంతవరకు సమతుల్యం చేసేందుకు తీసుకున్నదని వివరించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు పరిమాణం మారనుంది. ముఖ్యంగా Thar, Scorpio-N, XUV సిరీస్ SUVలు ధరల సవరణలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇటీవల లాంచ్ అయిన XUV 7XO వాహనానికి తొలి 40 వేల బుకింగ్స్ వరకు ధరల రక్షణ కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగే డెలివరీలకు కొత్త ధరలు వర్తించనున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో వాహనం కొనుగోలు చేయాలనుకునే వారు ఏప్రిల్ 6కి ముందే బుకింగ్ పూర్తి చేసేందుకు ఆసక్తి చూపే అవకాశముంది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరంలో ధరల పెంపు దిశగా అడుగులు వేస్తుండగా, మహీంద్రా తాజా నిర్ణయం ఆటో మార్కెట్లో చర్చనీయాంశమైంది.

