ePaper
Friday, April 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిరాజకీయ నాయకుడి కారు బీభత్సం: గాలిలో ఎగిరిపడ్డ ప్రాణం!

రాజకీయ నాయకుడి కారు బీభత్సం: గాలిలో ఎగిరిపడ్డ ప్రాణం!

  • మృత్యుశకటంగా మారిన విలాసవంతమైన కారు!
  • సామాన్యుడి ప్రాణం.. నాయకుడికి లోకువా?
  • చట్టం చుట్టంలా మారితే.. సామాన్యుడికి దిక్కెవరు?
  • నిషేధిత శబ్దాల హోరు.. రోడ్లపై కొనసాగుతున్న జోరు!
  • అధికార గర్వం.. అతివేగం: హాహాకారాలు చేసిన  వీరలంకపల్లి రహదారి!

 ఎడిటర్, పెన్ పవర్ ఏప్రిల్ 10:  

సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఒక ప్రమాదం గోకవరం మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక  రాజకీయ నాయకుడికి చెందిన కారు అతివేగంతో బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. అతివేగంతో దూసుకొచ్చిన రాజకీయ నాయకుడి వాహనం సామాన్యుడి పాలిట యముడిలా మారింది. బాధ్యత మరిచిన నాయకులు, స్పందించని యంత్రాంగం వెరసి నేడు సామాన్య ప్రజల ప్రాణాలు నడిరోడ్డుపై గాలిలో కలిసిపోతున్నాయి.

రక్తసిక్తమైన రహదారి: ప్రమాదం జరిగిందిలా.. : శుక్రవారం ఉదయం వీరలంకపల్లి కూడలి వద్ద ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. భారతీయ జనతా పార్టీ నాయకుడు కంబాల శ్రీనివాసరావుకు చెందిన వాహనం మితిమీరిన వేగంతో దూసుకువచ్చి, ఎదురుగా వస్తున్న నంగిరెడ్డి త్రిమూర్తులు అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ద్విచక్ర వాహనం ఆనవాలు లేకుండా నుజ్జునుజ్జవ్వగా, త్రిమూర్తులు కాలు విరిగి తీవ్ర రక్తగాయాలతో రోడ్డుపై పడిపోయారు.

వింత శబ్దాలు.. విపరీత వేగం: నిబంధనలు గాలికి! : సదరు నాయకుడి వాహన శ్రేణి నిరంతరం నిషేధిత శబ్ద యంత్రాలను (హారన్లు) ఉపయోగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన ఈ శబ్ద యంత్రాల వల్ల వాహనదారులు కంగారు పడుతున్నారని, ఊర్ల మధ్యలో కూడా వేగాన్ని తగ్గించకపోవడం వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునరావృతమవుతున్న ప్రమాదాలు,  హెచ్చరికలు బేఖాతరు  :  ఈ తరహా ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత వారమే ఇందుకూరుపేట వద్ద ఇదే వాహన శ్రేణి కారణంగా ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలు చూస్తుంటే, చట్టం అంటే భయం లేకుండా పోయిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చట్టం అందరికీ ఒకటేనా…?అధికారుల వైఖరిపై నిలదీత : సాధారణ వ్యక్తి చిన్న తప్పు చేస్తే వెంటనే స్పందించే యంత్రాంగం, రాజకీయ బలం ఉన్నవారి విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. గోకవరం ప్రాంతంలో సుమారు ఇరవై వాహనాలు నిషేధిత శబ్ద యంత్రాలతో తిరుగుతున్నా రవాణా శాఖ అధికారులు కళ్ళు మూసుకుని కూర్చోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రజలు మండిపడుతున్నారు.

జనం ఆగ్రహం.. వ్యవస్థకు హెచ్చరిక! :  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రాజకీయ అహంకారానికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు తమ విధిని విస్మరించి నాయకులకు దాసోహం అంటే, రేపు రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే దోషులపై కేసు నమోదు చేసి, బాధితుడికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular