శివగంగైలో టి.వి.కె బల ప్రదర్శనకు నేడు తెరలేపనున్న దళపతి విజయ్..! శివగంగై జిల్లా రాజకీయ సమీకరణాలను మార్చే రోడ్‌షోకు కారైకుడి నేడు వేదిక కానుంది.టి.వి.కె అధినేత విజయ్ బహిరంగ సభ, ఓపెన్ వ్యాన్ ప్రచారంతో నాలుగు స్థానాల్లో పార్టీకి ఊపు తేవాలని వ్యూహం సిద్ధమైంది.
- నాలుగు స్థానాలపై విజయ్ ప్రత్యేక ఫోకస్
- కారైకుడిలో అభిమానుల సందడి పీక్స్‌కు
- తేవర్ విగ్రహం వద్ద హై వోల్టేజ్ స్పీచ్
- 37 షరతులతో పోలీసుల కట్టుదిట్టమైన అనుమతి
- శివగంగై రాజకీయాల్లో టి.వి.కె టర్నింగ్ పాయింట్?
న్యూస్ డెస్క్ పెన్ పవర్ | ఏప్రిల్ 10 :
తమిళనాడు ఎన్నికల రాజకీయాల్లో హీట్ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, టి.వి.కె అధినేత విజయ్ నేడు కారైకుడిలో నిర్వహించనున్న భారీ రోడ్‌షోపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. శివగంగై జిల్లాలోని శివగంగై, కారైకుడి, తిరుపత్తూరు, మనమదురై నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టి.వి.కె అభ్యర్థులకు మద్దతుగా ఈ ప్రచారాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న విజయ్, మేలూరు–తిరుపత్తూరు మార్గంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కారైకుడి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పాత బస్ స్టాండ్–వి.ఓ.సి రోడ్–కలానివాసల్–వాటర్ ట్యాంక్ మార్గాల్లో ఓపెన్ వ్యాన్‌లో అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. చివరగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉన్న తేవర్ విగ్రహం వద్ద బహిరంగ ప్రసంగం చేయనున్నారు. ఈ ర్యాలీకి పోలీసులు 37 కఠిన షరతులతో అనుమతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యాహ్నం 2 గంటలలోపు సభ ముగించాలి, వచ్చిన మార్గంలోనే తిరుగు ప్రయాణం చేయాలని స్పష్టం చేశారు. భారీ జనసందోహం అంచనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఇక విజయ్ రాకతో కారైకుడిలో అభిమానుల సందడి పీక్స్‌కు చేరుకుంది. తేవర్ విగ్రహం పరిసరాల్లో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్వాగత ద్వారాలతో ప్రత్యేక అలంకరణలు చేపడుతున్నారు. యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చే సూచనలు ఉండటంతో ఈ రోడ్‌షో ఎన్నికల ప్రచారంలో టర్నింగ్ పాయింట్ కావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

