రాయలసీమలో వైసీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు బహిరంగంగా రచ్చకెక్కుతున్నాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. టికెట్ల పంచాయితీలు, ఆధిపత్య పోరు కేడర్‌ను రెండు వర్గాలుగా చీల్చేస్తున్నాయి. పార్టీ హైకమాండ్ మౌనం నేతల మధ్య ఘర్షణలను మరింత పెంచుతోంది. స్థానిక ఎన్నికల ముందు ఈ విభేదాలు వైసీపీ బలాన్ని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది.
- ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి–బుట్టా రేణుక వర్గాల ఘర్షణ
- సింగనమల, కదిరిలో రోడ్డెక్కిన నేతల పోరు
- రాప్తాడు–ధర్మవరం నేతల మధ్య మాటల యుద్ధం
- కేడర్ రెండు వర్గాలుగా చీలిపోవడం
- స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అంతర్గత కలహాలు
కర్నూలు, పెన్ పవర్ , ఏప్రిల్ 7:
రాయలసీమలో వైసీపీకి అంతర్గత వర్గపోరు పెద్ద సవాలుగా మారుతోంది. పార్టీ ప్రస్తుతం అధికారంలో లేకపోయినా, బలోపేతం కావాల్సిన సమయంలోనే నేతల మధ్య విభేదాలు బహిరంగ స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గ్రూపు రాజకీయాలు, టికెట్ వివాదాలు పార్టీ పరువును దెబ్బతీస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుటుంబం, మాజీ ఎంపీ బుట్టా రేణుక వర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరు వర్గాలు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో కేడర్ కూడా రెండు భాగాలుగా చీలిపోయింది. ఇదే పరిస్థితి సింగనమల, కదిరి ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. కదిరిలో అయితే నేతల మధ్య విభేదాలు చెప్పులతో కొట్టుకునే స్థాయికి చేరుకున్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. అనంతపురం జిల్లాలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతలను వెంటేసుకుని తిరుగుతున్నారంటూ ఒక వర్గం ఆరోపిస్తే, పార్టీ మారిన వారిని తిరిగి చేర్చితే తీవ్రంగా స్పందిస్తామంటూ మరో వర్గం హెచ్చరిస్తోంది. ఈ అంతర్గత ఘర్షణలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పునర్నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు పెరగడం వల్ల రాయలసీమలో వైసీపీ బలం క్రమంగా తగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

