గర్నికం దళిత కాలనీకి మంచినీళ్ళు ఇవ్వండి మహప్రభో
-ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన…
నర్సీపట్నం, పెన్ పవర్ :
అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రానికి అర కిలోమీటర్ దూరంలో గర్నికం దళిత కాలనీ ఉంది. ఈ కాలనీలో 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం జల జీవన్ మెషిన్ ద్వారా మంచినీరు కోసం ఇంటింటి కోళాయిలు నిర్మాణం చేశారు కానీ, కుళాయిలకు నీరు ఇవ్వలేదు. కొళాయిలు దిష్టిబొమ్మలాగా ఇంటి ముందుని ఉన్నాయి తప్ప నీరు రావడం లేదు. కాలనీలో పిల్లలు నీళ్ళ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు చేతి బోర్లు ఉన్నా, రెండు బోర్లు పనిచేయడం లేదు. రెండు గంటల పాటు బోరు కొడితే గాని నీరు రావడం లేదు. దీనివల్ల వృద్దులు అనేక ఇబ్బందులకు పడుతున్నారు. మంచినీళ్లు కోసం రోజువారి కూలి పనులు కూడా మానుకుంటున్నారు. ప్రభుత్వ వెంటనే మా దళిత కాలనీకి మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని, లేకపోతే మండల అభివృద్ధి కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ నాలుగో తేదీ లోగా మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.గోవిందరావు పిలుపునిచ్చారు. కెవిపిఎస్ నాయకులు సిహెచ్ సూరిబాబు, సిహెచ్. రాజు, సెవెంటి బాల తదితరులు పాల్గొన్నారు.

