ePaper
Sunday, March 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పదిలం

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పదిలం

📰 Generate e-Paper Clip

– రామచంద్రపురంలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు

రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 29:
“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామచంద్రపురం నియోజకవర్గంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామచంద్రపురం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సుభాష్, పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రేశ్వంత్ రాయ్ తదితరులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.


పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో వినూత్న పథకాలు అమలు చేసి చరిత్ర సృష్టించారని చెప్పారు. రూ.2కే కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం వంటి సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతోనే సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు.
డ్వాక్రా ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమమైందని, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించామని తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


టీడీపీలోనే కొనసాగుతా
తాను జీవితాంతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని, మంత్రి నారా లోకేష్ టీమ్‌లో పనిచేస్తానని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. రామచంద్రపురం ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీని నిలబెట్టుకుంటూ అభివృద్ధికి కట్టుబడి ఉంటానన్నారు. కోటిపల్లి–ముక్తేశ్వరం రోడ్డు బ్రిడ్జి, కోనసీమకు రైల్వే సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి ప్రణాళిక
రామచంద్రపురం పట్టణంలో సుమారు రూ.40–50 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధికి రూ.220 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.
కన్నీటి పర్యంతమైన మంత్రి
సభలో ఒక భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. ద్రాక్షారామానికి చెందిన శరణ్య అనే బాలిక క్యాన్సర్‌తో మృతి చెందిన విషయాన్ని ఆమె తండ్రి వివరించగా మంత్రి సుభాష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో కంటైనర్ ఆస్పత్రులు, మొబైల్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
కార్యకర్తలకు సన్మానం
పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్న 12 మంది సీనియర్ కార్యకర్తలను మంత్రి ఘనంగా సత్కరించారు. ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.సహపంక్తి భోజనాలు
కార్యక్రమం అనంతరం మంత్రి సుభాష్ కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular