సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీడిమెట్ల సర్కిల్ షోకాజ్ నోటీసు జారీ..
సుచిత్ర రోడ్డు వెన్నలగడ్డలో అక్రమ షెడ్డు నిర్మాణంపై నివాసితుల ఫిర్యాదు..
జీహెచ్ఎంసి యాక్ట్ 1955 టిజి-బిపాస్ 2020 యాక్ట్ ఉల్లంఘనగా గుర్తింపు..
మార్చి 16న జీడిమెట్ల సర్కిల్ సిఎంసి అధికారులకు ఫిర్యాదుపై షోకాజ్ నోటీసు జారి..
పనులు నిలిపివేసి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని, పేర్కొన్న అధికారులు..
ఏప్రిల్ 4న విచారణకు హాజరు కావాలి లేకపోతే కూల్చివేతకు హెచ్చరిక..
కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ‘సిఎంసి’కి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్, మార్చి 23:
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని సుచిత్ర వెన్నెలగడ్డలో..! రహదారి ఆక్రమణతో, అనుమతుల్లేని అక్రమ షెడ్డులో మద్యం దుకాణం నిర్వహణపై స్థానికులు మండి పడుతున్నారు.. సంబంధిత శాఖ ఎక్సైజ్ అధికారులకు స్థానికుల లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించడంతో, సోమవారం మరోసారి కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదును అందజేశారు.. జీడిమెట్ల సర్కిల్ అనుమతి లేకుండా టిన్ షెడ్ నిర్మాణం చేపట్టిన ఈ ఘటనపై నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఫిర్యాదు దారుల ప్రకారం.. వెన్నలగడ్డ ప్రాంతంలోని ‘ఎల్‌జిఎస్’ సుచిత్ర క్లాసిక్ అపార్ట్‌మెంట్స్ పక్కన ఉన్న ప్లాట్‌లో మద్యం దుకాణం నిర్వహణకు, ఎలాంటి మున్సిపల్ అనుమతి లేకుండా టిన్ షెడ్ నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు 16.03.2026న ఫిర్యాదు చేశారు.. ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి నిర్మాణం అనధికారమని నిర్ధారించారు..
చట్టాల ఉల్లంఘనగా గుర్తించి.. షోకాజ్ నోటీసులు..
ఈ అక్రమ షెడ్డు నిర్మాణం జీహెచ్ఎంసి యాక్ట్ 1955 లోని సెక్షన్ 178 మరియు ‘టిజి-బిపాస్’ యాక్ట్ 2020 సెక్షన్ 7 నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. నగర అభివృద్ధి నియమాలను పక్కన పెట్టి నిర్మాణాలు చేపట్టడం తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు.. జీడిమెట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు..నోటీసు నెంబర్:12944/CBM/TRS/UC/ 2026 ప్రకారం నోటీసు అందుకున్న తేదీ నుంచి 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.. సంబంధిత అక్రమ షెడ్డు నిర్మాణాన్ని ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలని, వెంటనే పనులు నిలిపివేయాలని పేర్కొన్నారు.. సంబంధిత వ్యక్తి 04 ఏప్రిల్ 2026 మధ్యాహ్నం 3 గంటలకు జీడిమెట్ల డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. హాజరు కాకపోతే ఎటువంటి ఆధారాలు లేవని భావించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పలుకుబడితో షెడ్డు నిర్మాణం..! అడకత్తెరలో పోకలా టౌన్‌ప్లానింగ్..
కుత్బుల్లాపూర్ జోన్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెన్నెలగడ్డలో అక్రమ షెడ్డులో స్థానికులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది.. ఓవైపు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు స్థానికులు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.. మరోవైపు మద్యం దుకాణం ఏర్పాటుకు, అక్రమ షెడ్డు నిర్మాణానికి అధికారపార్టీ నాయకుల పలుకుబడి ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మద్యం దుకాణం నిర్వహించాలంటే షెడ్డు నిర్మాణానికి అనుమతులు అవసరం లేదని, ల్యాండ్ యజమానితో అగ్రిమెంట్ ఉంటే సరిపోతుందని, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చెప్పడం గమనార్హం..
మద్యం దుకాణాల ఏర్పాటుకు “బడి-గుడి” నిబంధనలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వం.. స్థానికుల అభిప్రాయాలను సేకరించకుండానే సంబంధిత అధికారులు దుకాణాలు మంజూరు చేయడం, సరైనది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వానికి ఆర్ధిక వనరులు కల్పించేందుకు ఇప్పటికే అనధికారికంగా “బెల్ట్ షాపులు” నిర్వహిస్తుండగా..! తాటి కల్లు పేరుతో మందుతో తయారు చేసిన కల్లును విక్రయించి ప్రజలను మత్తులో ఉంచుతున్నారని స్థానికులు మండి పడ్డారు.. ప్రజల శ్రేయస్సు కోరే విధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు, పాలకులు.. తాగుబోతులను చేస్తూ, ఆర్ధికంగా క్షీణింపజేసి, అనారోగ్యాలకు గురిచేయడానికి ప్రభుత్వం కీలకంగా మారిందని ఆరోపిస్తున్నారు..



