ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి
గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఏప్రిల్ 11: అణగారిన వర్గాల అభ్యున్నతి, స్త్రీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు.శనివారం రాజవొమ్మంగి పంచాయతీ కార్యాలయ ఆవరణలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను మండల పార్టీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా 1848లో బాలికల కోసం పాఠశాలను స్థాపించి విద్యా విప్లవానికి నాంది పలికారన్నారు. ఆ పాఠశాలలో ఆయన భార్య సావిత్రిబాయి పూలే బాలికలకు విద్యాబోధన అందించారని గుర్తుచేశారు.సమాజంలో నెలకొన్న కులవివక్ష, అంటరానితనం వంటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కరణవాది పూలే అని కొనియాడారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ, ఆశ్రమాలను స్థాపించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారని తెలిపారు. కులవ్యవస్థలోని అణచివేతను వివరిస్తూ “గులాంగిరి” వంటి గ్రంథాలను రచించారని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1888లో ‘మహాత్మా’ బిరుదు ప్రదానం చేయడం జరిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ లోతా లక్ష్మణరావు, సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవ్, మండల ఉపాధ్యక్షుడు జెట్టి మధు, మహిళా అధ్యక్షురాలు ముప్పన సావిత్రి, ముప్పన మోహన్, పెదిరెడ్ల సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు, అలాగే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

