అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కీలక ప్రక్రియ పూర్తైంది. కేంద్ర న్యాయశాఖ తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5(2)లో స్పష్టంగా “అమరావతి” పేరును చేర్చారు. ఈ చట్టం 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా గెజిట్‌లో పేర్కొన్నారు. దీంతో దశాబ్దకాలంగా కొనసాగిన రాజధాని అనిశ్చితికి అధికారిక ముగింపు లభించింది.
- రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి బిల్లుకు చట్టరూపం
- కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
- సెక్షన్ 5(2)లో ‘అమరావతి’కి స్పష్టమైన ప్రస్తావన
- జూన్ 2, 2024 నుంచే అమల్లోకి చట్టం
- రాజధాని వివాదానికి కేంద్రం ఫుల్‌స్టాప్
స్టేట్ బ్యూరో రిపోర్ట్, పెన్ పవర్ | ఏప్రిల్ 7:
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరిన ఈ బిల్లును పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి సంతకం చేశారు. వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ అమరావతిని ఏపీ ఏకైక మరియు శాశ్వత రాజధానిగా అధికారికంగా ప్రకటించింది. గెజిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5(2)లో ఉన్న “a new capital” అనే పదబంధాన్ని తొలగించి, “Amaravati shall be the new capital”గా సవరణ చేశారు. ఈ చట్టం 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా పేర్కొనడం విశేషం. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గడువు ముగిసిన తేదీ నుంచే ఈ చట్టానికి రిట్రోస్పెక్టివ్ అమలు కల్పించారు. ఇటీవలే కేంద్రం ప్రవేశపెట్టిన ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026పై లోక్‌సభ, రాజ్యసభల్లో విస్తృత చర్చ జరిగింది. అనంతరం ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ నోటిఫికేషన్‌తో అమరావతి రాజధాని అంశానికి పూర్తి చట్టబద్ధత లభించగా, రాష్ట్ర పరిపాలనా స్పష్టతకు ఇది కీలక మైలురాయిగా మారింది.
