సమానత్వానికి ప్రతీకగా నిలిచిన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. అంటరానితనాన్ని ఎదురించి అట్టడుగు వర్గాల ఆత్మగౌరవానికి ఆయనే ఆశాకిరణం అయ్యారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి సామాజిక న్యాయం వరకు ఆయన పోరాటం విశిష్టమైనది. వ్యవసాయం, కార్మిక సంక్షేమం, జాతీయ ఆహార విధానాల్లో ఆయన ముద్ర అపారమైనది. సమతా దివస్ సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకోవడం సమాజానికి నిజమైన నివాళి.
- అంటరానితనంపై తిరుగుబాటు చేసిన మహానాయకుడు
- దళిత ఆత్మగౌరవానికి బాబూజీ జీవితం మార్గదర్శకం
- స్వాతంత్ర్య సమరయోధుడిగా అజరామర సేవలు
- సామాజిక సమానత్వానికి అంకితమైన రాజకీయ ప్రస్థానం
- హరిత విప్లవానికి బాటలు వేసిన దూరదృష్టి నాయకుడు
- కార్మిక చట్టాల రూపకర్తగా చరిత్రలో చిరస్థానం
- హిందూ కోడ్ బిల్లుకు అండగా నిలిచిన ధైర్య స్వరం
- 50 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నాయకుడు
- సమతాస్థల్ నుంచి సమతా దివస్ వరకు చిరస్మరణీయ గాథ
- సమానత్వ భారతానికి బాబూజీ ఆశయాలే దిక్సూచి
మహామహుల జీవితగాధలు సంసారసాగరం మీద మనలను ధరింపజేయు పడవలకు మార్గమును చూపు దివ్యదీపికలు. అంటరానితనపు అతిక్రూరమైన పరిణామాలను అనుభవించి, దానిపై తిరగబడి సాంఘికంగా అట్టడుగున పడి ఉన్నసమాజంలో నుంచి మేమూ మనుష్యులమే అంటూ తిరుగుబాటుచేసి ముందుకు తోసుకొచ్చిన క్రాంతికిరణం మన కథానాయకుడు డా.బాబూ జగజ్జీవన్ రామ్ కి జన్మనిచ్చినది భారతమాతయే. చరిత్రలో గతినిశాసించిన వారు బహుకొద్దిమందే అటువంటి అరుదైన అగ్రగణ్యులలో డా.బాబూ జగజ్జీవన్ రామ్ ఒకరు. బాబూజీలాంటి దేశనాయకుని గురించి వ్రాయాలన్నా చెప్పాలన్న ఎంతోకొంత మిగిలేఉంటుంది ఎంతచెప్పినా తక్కువే అవుతుంది ఎందుచేత అనగా అటువంటి వారిలో ధీరోదాత్తత,నిష్కపటం, కరుణ,జాలి,దేశభక్తి,నిశ్చల దైవభక్తి ఇలా ఎన్నో ఒక మహనీయునికి ఉండవలసిన సకల సద్గుణాలు మూర్తిభవించి ఉన్నవి. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం అలుపెరిగిన సమరం సాగించిన రాజకీయ సామాజిక విప్లవయోధుడు డా.బాబూ జగజ్జీవన్ రామ్ గారు. జాతిజనులను విద్యావంతులుగాను ఆత్మాభిమానంకలవారిగానూ చేయాలన్నదే ఆయనలక్ష్యం.

ప్రజానాయకుడిగా పరిపాలనా దక్షకుడిగా సుదీర్ఘకాలం పార్లమెంటుసభ్యులుగా ఉండి భరతఖండ పీడితతాడిత ప్రజలకు ఆశాజ్యోతి రాజనీతిజ్ఞుడు తన జీవితకాలంలో శ్రమించి ప్రజలచే ‘బాబూజీ’గా పిలవబడుతూ మహాత్మాగాంధీజీ చేత ‘భారత జాతిరత్నం’ అని పొగడబడిన బాబూ జగజ్జీవన్ రామ్ గారు పుటము వేసిన బంగారం. డా.బాబూ జగజ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో పేద మరియు దళిత కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న శోభిరామ్ బసంతిదేవి పుణ్య దంపతులకు జన్మించారు. డాక్టర్ బీర్బల్ గారి పుత్రిక ఇంద్రాణి దేవితో 1935వ సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు సురేష్ కుమార్ (1985వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు.) కుమార్తె మీరాకుమార్(లోక్ సభ మాజీ స్పీకర్). శ్రీమతి మీరాకుమార్ తండ్రి ఆశయ సాధనకొరకు కృషిచేయుచున్నది తండ్రి మరణానంతరం ‘బాబూ జగజ్జీవన్ రామ్ అఖిలభారత సమతా మూమెంట్’ అనే సంస్థను స్థాపించి దళితప్రజానీకానికి ఎంతో తోడ్పాటు అందించుచున్నారు. డా.బాబు జగజ్జీవన్ రామ్ లాంటి దేశనాయకులు బహుఅరుదు జగజ్జీవన్ రామ్ ఒక వ్యక్తికాదు ఒకసంస్థ, పూర్ణపురుషుడు ఆయన దేశంమొత్తం మీద లెక్కపెట్టాల్సిన కొద్దిమంది నాయకులలో ఒకరు. వారి మేధ, రాజకీయచతురత, సుధామయ వాక్కు, దూరదృష్టి, వ్యక్తిత్వ వైభవము, అసాధారణ పటిమ, త్యాగము అనన్యసామాన్యములు. జగ్జీవన్ రామ్ ఎక్కువసమయం ముఖాముఖిగా ప్రజలసమస్యలు పరిష్కారం కొరకు, దేశ సమగ్ర అభివృద్ధి కొరకు హెచ్చించినప్పటికీ మిక్కిలి తక్కువసమయంలో తన స్మృతిపథంలో ఉన్నవాటిని అక్షరమాలచేశారు.
బాబూ జగజ్జీవన్ రామ్ ‘జీవన్ ఔర్ వ్యక్తిత్వ'( జీవనసరళి వ్యక్తిత్వ వికాసం) అనే గ్రంథాన్ని వ్రాసారు. సిపిఐ(ఎం) అగ్రనాయకులు సిద్ధాంతవేత్త కీ.శే. బీటి రణదేవ్ బాబూ జగజ్జీవన్ రామ్ రాసిన పుస్తకంపై సమీక్షించి ఈవిధంగా అన్నారు. “అత్యధికకాలం అధికారంలో దళితనాయకుడిగా బాబూ జగజ్జీవన్ రామ్ అనుభవాలు, అభిప్రాయాలు ప్రత్యేకంగా పరిశీలనార్హమవుతాయి. దళితులకు రాజ్యాధికారం పేరుతో ఇప్పుడు వినవస్తున్న నినాదాల ఔన్నత్యాన్ని పరిమితిని అర్థం చేసుకోవడానికి కూడా అలాంటి పరిశీలన అవసరమవుతుంది.” ‘జాతినిర్మాణానికి జగజ్జీవన్ రామ్ చేసినకృషి’ అనే అంశంపై ఏప్రిల్ 18,2006వ సంవత్సరం హైదరాబాదులో జరిగిన సెమినార్లో ప్రముఖ వ్యవసాయశాస్త్రజ్ఞుడు శ్రీ ఎమ్.ఎస్.స్వామినాథన్ మాట్లాడుతూ ఆహారధాన్యాలకొరత తీవ్రంగాఉన్న దశలో గోధుమవిప్లవం ద్వారా గోధుమఉత్పత్తిని పెంచి వ్యవసాయరంగంలో స్వర్ణయుగాన్ని స్థాపించిన ఘనత జగజ్జీవన్ రామ్ కే దక్కిందని, ఆహారధాన్యాలను దేశఅవసరాలకు తగినవిధంగా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో జగజ్జీవన్ నేతృత్వంలోనే జాతీయస్థాయి వ్యవసాయ విధానంపై ముసాయిదా తయారయింది అన్నారు. జగజ్జీవన్ రామ్ ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు వ్యవసాయ విధానాన్ని చేపడుతున్నారు.” బాబూ జగ్జీవన్ రామ్ జాతీయ ఆహారవిధానాన్ని రూపొందించాడు. నూతన వ్యవసాయ విధానం పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాలకే పరిమితమైంది గోధుమ, వరి వంటి పంటలకు పరిమితమైంది. దీనివలన ఎక్కువగా రైతులే ప్రయోజనం పొందారని సన్నకారురైతుల వ్యవసాయకార్మికుల ప్రయోజనం కొరకు ప్రభుత్వం కృషి చేయాలని బాబూ జగ్జీవన్ రామ్ గ్రహించి నాలుగో ప్రణాళికలో 1969 లో సాంద్ర వ్యవసాయ వ్యూహాన్ని రూపొందించారు. అందులోని అంశాలు.1.ముఖ్యమైన అన్ని పైరుల గురించి సమన్వయ పరిశోధన 2. సేద్యపు నీటి సౌకర్యాలు విస్తరణ కొనసాగించడం. 3.ప్రస్తుతం ఉన్న ఆయికట్టు క్రిందకి ఎక్కువ భూమిని తీసుకురావడం ఎరువులు, సస్యరక్షణ సామాగ్రి వ్యవసాయంత్రాలు రుణ సౌకర్యాలు. 4.సరఫరాను విస్తృతి చేయడం. 5.ప్రధాన వాణిజ్యపంటల దిగుబడి పెంచడానికి అనుకూలప్రాంతాలలో అన్నిశక్తులు కేంద్రీకరించి కృషి చేయడం. 6.ఉత్పత్తిదారును లభించే విధంగా వ్యవసాయ వాణిజ్య పద్ధతిని మెరుగుపరచడం అలాగే ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులకు కనీసధరల హామీ అంతేకాకుండా మేలైనవిత్తనాలు ఉత్పత్తి పంపిణీలపట్ల ప్రత్యేకశ్రద్ధ చూపించారు. అలాగే వ్యవసాయ పరపతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం గురించి శ్రద్ధ వహించారు.

బాబూ జగజ్జీవన్ రామ్ ఒక విధానాన్ని రూపొందించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతో కనీసధరలు ఎంత మొత్తమైనా ఇచ్చి కొనడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు తెలియజేసి అమలయ్యేటట్లు తగుచర్యలను చేపట్టారు. ఒక సభలో బాబూ జగజ్జీవన్ రామ్ మాట్లాడుతూ శాస్త్రీయమైన పద్ధతిలో ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయాన్ని కొనసాగిస్తే అధిక దిగుబడి సాధ్యమే అధికదిగుబడి లక్ష్యంగానే కృషిచేయాలి కానీ లాభాలకోసం చేయకూడదని హెచ్చరించారు. భూమిలోను సారం, స్వభావాలను కాపాడుకోకుండా ఉత్పత్తులు కొనసాగిస్తే భూములు ఎడారులు కాగల ప్రమాదం ఉందని నొక్కి చెప్పారు. బాబూ జగజ్జీవన్ రామ్ కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిగా ఉన్న సమయంలో పండిన ధాన్యాల నిలువలు ఎక్కువై గోదాములు సమస్యగా ఉండేవి. అందుకే బహిరంగస్థలాలలో మైకా కాగితాలతో పండిన ధాన్యాలు నిల్వ చేయవలసి వచ్చింది. దీని పరిష్కారం కోసం భారత ఆహార సంస్థను స్థాపించారు. బాబూ జగజ్జీవన్ రామ్ ఈదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1968వ సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగిన స్నాతకోత్సవ సభలో కాన్పూర్ యూనివర్సిటీ వారు మరియు విక్రమ్ యూనివర్సిటీ, ఉజ్జయిని వారు,’డాక్టర్ ఆఫ్ సైన్స్’ అనే గౌరవ డాక్టరేట్ ను 4-07-1967 న ఇచ్చి గౌరవించారు. 1951ఫిబ్రవరి 5వ తేదీన హిందూకోడ్ బిల్లుపై అధికారపక్షమైన కాంగ్రెస్ లో తీవ్రమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డవి. బిల్లును సమర్ధించే వారికంటే వ్యతిరికించే వారే ఎక్కువగా ఉన్నారు అందువలన బిల్లుపై చర్చ్ వాయిదాపడింది. మరల 1951 సెప్టెంబర్ 17వ తేదీన ఈబిల్లుపై తుదిచర్చ కొనసాగుతున్న తరుణంలో, హిందూకోడ్ బిల్లును విమర్శిస్తూ డా.అంబేద్కర్ను కించపరుస్తూ చేసిన అల్లరి, పొలికేకలకు, బాబూ జగజ్జీవన్ రామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అంబేద్కర్ తన మేధా సంపత్తిని అంతా వినియోగించి అత్యంతరమణీయంగా తీర్చిదిద్దిన హిందూకోడ్ బిల్లును విమర్శించడం మంచిదికాదని అభ్యంతరం తెలియజేసి బాబూ జగ్జీవన్ రామ్ తన వాదనా ప్రతిభలతో విమర్శచేసిన వారిపై విరుచుకుపడ్డారు. 50ఏళ్లు రాజకీయ జీవితమును పోరాటానికి అంకితం చేసినవ్యక్తి డా.బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్య ఉద్యమాలు,సామాజిక ఉద్యమాల్లో ఎన్నోపోరాటాలు చేశారు. 1930లో జగజ్జీవన్ రామ్ సత్యాగ్రహి ఉద్యమంలో మహాత్మాగాంధీతో కలిసి పాల్గొన్నారు. తన 27 ఏళ్ల వయసులోనే 1935వ సంవత్సరంలో బీహార్ లోని తన సొంతజిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1986 వరకు 50ఏళ్లపాటు ఎంపీగా కొనసాగిన జగజ్జీవన్ రామ్ గారు ఓటమి ఎరగని నాయకుడిగా ప్రపంచరికార్డును సొంతం చేసుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ క్యాబినెట్లో తక్కువ వయసు కలిగిన మంత్రి బాబూ జగజ్జీవన్ రామే. 1940లో బీహార్ కాంగ్రెస్ కమిటీ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1941లో మొదటిసారి జైలు అనుభవం పొందారు. 1946లో క్యాబినెట్ మిషన్ కు దళిత ప్రతినిధిగా ప్రాతనిధ్యం వహించారు. 1946లో కార్మిక మంత్రిగా పనిచేశారు.1947లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో జగజ్జీవన్ రామ్ గారు ప్రసంగం చేశారు. 1952 నుండి 1956 వరకు తంతి తపాలాశాఖ మంత్రిగాను, 1957 నుండి 1962 వరకు రైల్వే మంత్రిగాను, 1962 నుండి 1963 వరకు రవాణా మరియు ఉపరితలశాఖా మంత్రిగారు పనిచేశారు. 1966 నుండి 1967 వరకు కార్మిక శాఖా మంత్రిగాను, 1967 నుండి 1970 వరకు వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు 1970 నుండి 1974 వరకు ఇండో పాక్ యుద్ధ సమయంలో రక్షణమంత్రిగా పని చేసారు. 1974 నుండి 1977 వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖమంత్రిగా పని చేసి హరితవిప్లానికి శ్రీకారం చుట్టారు. 1977వ సంవత్సరంలో కాంగ్రెస్కు రాజీనామా చేశారు.1977- 1980 సంవత్సరంలో రక్షణమంత్రిగాను మరియు భారత ఉపప్రధానిగా కూడా పనిచేశారు. ఆయన ఏపదవిలో ఉన్నా ఆపదవికే వన్నెతెచ్చారు. భారత ప్రధానమంత్రిగా అవ్వాల్సిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు అంతటి స్థాయికి ఎదిగినవ్యక్తి షెడ్యూల్ కులాల నుంచి వచ్చినవారిలో మొట్టమొదటివారు జగజ్జీవన్ రామ్ గారే. తన రాజకీయ జీవితంలో మచ్చలేని మహానీయుడిగా పేరుతెచ్చుకున్న డా.బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై ఏళ్లు కేంద్రమంత్రిగా ప్రయాణం. యాభైఏళ్లు పార్లమెంటులో దళితులహక్కుల బిల్లులపై ప్రస్థానం. వేరెవ్వరికి దక్కని గౌరవం. మరెవ్వరూ ఎక్కలేని శిఖరం. క్యాబినెట్ మిషన్ బాబూజీని మరియు అంబేద్కర్ ను ఆహ్వానించింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా బాబూ జగ్జీవన్ రామ్ డాక్టర్ అంబేద్కర్ లు ఎంపికకాబడ్డారు.

శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ కార్మిక మంత్రిగా ఉన్నసమయంలో అనేక కార్మికచట్టాలు చేయబడ్డాయి. 1948లో పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీ జగజ్జీవన్ రామ్ శ్రామికుల సంక్షేమాన్ని కాంక్షించారు. ఆయన హయాంలో చేయబడిన చట్టాలు 1.కార్మికసంబంధాలచట్టం 2. భారతట్రేడ్ యూనియన్ చట్టం 3. మైకా గని కార్మికుల సంక్షేమనిధి చట్టం1947, 4. డాక్ వర్కర్స్ యాక్ట్ 1948, 5.ఫ్యాక్టరీల చట్టం 1948, 6.బొగ్గుగనుల కనీసవేతనాలు చట్టం 7. బొగ్గుగనులు ప్రావిడెంట్ ఫండ్ అండ్ బోనస్ స్కీమ్ యాక్ట్ 1948, 8.పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం 1951, 9. ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951. బాబూ జగ్జీవన్ రామ్ కార్మికశాఖామంత్రిగా కార్మిక సంక్షేమానికి అమలు చేసిన ముఖ్య కార్యక్రమాలు: 1. కార్మిక సంబంధాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వ ప్రతినిధులు కార్మిక నాయకులు యాజమాన్యం కలిసిన త్రిసభ్య కార్మిక సమావేశాలు ఏర్పాటు చేయడం. 2. కార్మిక సమస్యలపై దర్యాప్తు కమిటీలను నిలకలపడం. 3. సమగ్రమైన కార్మిక చట్టాల నిర్మాణం. 4. కనీస వేతనాల నిర్ణయకపు యంత్రాంగానే నెలకొల్పడం. 5. కార్మిక విధానాలు సరిగ్గా అమలు పరచడం కోసం వాటి పర్యవేక్షణ కోసం చీఫ్ లేబర్ కమిషనర్ పర్యవేక్షణలో ఒక సంస్థను నెలకొల్పడం. 6.కార్మిక సంఘాలను తగు రీతులు యాజమాన్యం గుర్తించడం 7. పారిశ్రామిక ఉద్యోగాలు సక్రమ పద్దతిలో భర్తీ కావడానికి నిర్ణీతమైన ఉత్తర్వులు జారీ చేయడం. 8.నిర్ణీత పనిగంటలు కరువుభత్యం క్రమమైనజీతాలు కనీసవేతనాలచెల్లింపు, కార్మికుల భవిష్య నిధులు కర్మాగారాల్లో క్యాంటీన్ సదుపాయాలు, ఆరోగ్య పథకాలు కార్మిక సంక్షేమానికి చెందిన ఇంకా ఎన్నో సదుపాయాలు ఆయా కార్మిక చట్టంలో పొందుపరచడానికి ఎంతో కృషి చేశారు. 1986 జూలై 6న బాబూజీ స్వర్గస్తులయ్యారు.

ఆయనస్మృతి చిహ్నంగా భారతజాతిపితగా చెప్పబడే మహాత్మాగాంధీ, భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధమ మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మొదలైన ప్రముఖుల సమాధుల దగ్గర్లో ‘సమతాస్థల్’ గా బాబూ జగ్జీవన్ రామ్ సమాధిని నిర్మించారు.సమానత్వం, న్యాయం, సామాజిక సమగ్రతను ప్రోత్సాహించుటవలన భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘సమతాదివస్’గా ప్రకటించింది. సాటి మనిషిని మనిషిగా గుర్తించి గౌరవించిన నాడే బాబూజీ ఆశయాలకు ఆదర్శాలకు ఆశలకు నైతిక విలువలకు నిజమైన నివాళి. ఆయనకు మనం అర్పించు సరైన నివాళి.

వీధి దుర్గారావు ఎం. ఏ. కవి, రచయిత.

