Homeఆంధ్రప్రదేశ్కాకినాడగొల్లపాలెంలో వరుస దొంగతనాలు!

గొల్లపాలెంలో వరుస దొంగతనాలు!

పోలీసులకు సవాల్‌గా మారిన సహకార బ్యాంకు ఏటీఎం చోరీ

నిఘా వ్యవస్థలపై ప్రజల్లో ప్రశ్నలు.. వరుస ఘటనలతో ఆందోళన

కాజులూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 9:
గొల్లపాలెం గ్రామం.. నిత్యం జనసంచారం ఉండే ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాలతో సందడిగా ఉండే ప్రాంతం. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గొల్లపాలెం గ్రామంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఏటీఎంను పగులగొట్టి రూ.4.35 లక్షల నగదును అపహరించడం పోలీసు వ్యవస్థకు సవాల్‌గా మారింది.
అర్ధరాత్రి ఏటీఎం ధ్వంసం
గొల్లపాలెం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 9 గంటల మధ్య ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు ఇన్‌చార్జ్ మేనేజర్ గొల్లపల్లి పకీర్ రావు ఫిర్యాదు మేరకు గొల్లపాలెం ఎస్‌ఐ ఆర్‌వీఎన్ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సెప్టెంబర్ 5న సాయంత్రం బ్యాంకు భవనంతో పాటు పశ్చిమ వైపున ఉన్న ఏటీఎంకు తాళాలు వేసి మేనేజర్ వెళ్లిపోయారు. సెప్టెంబర్ 7 ఉదయం బ్యాంకుకు వచ్చిన సమయంలో ఏటీఎం షట్టర్ వద్ద ఇనుప రాడ్ పడి ఉండటాన్ని గుర్తించారు. ఏటీఎం పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తులు యంత్రాన్ని బలవంతంగా ధ్వంసం చేసి అందులోని రూ.4,35,500 నగదును అపహరించినట్లు గుర్తించారు.
బ్యాంకులోకి ప్రవేశించి.. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి
చోరీ చేసిన వ్యక్తులు బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్‌ను పగులగొట్టి లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి సీసీ కెమెరాలను ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బ్రాంచ్ మేనేజర్ డెస్క్‌పై ఉన్న మొబైల్ ఫోన్‌తో పాటు మరో డబ్బీని కూడా అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సంఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సెప్టెంబర్ 8న కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ డా. మహంతి కిషోర్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దర్యాప్తును ముమ్మరం చేయాలని సూచిస్తూ కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టాలని ఆదేశించారు.
ఎనిమిది నెలల క్రితం.. ఇదే బ్యాంకు వద్ద బండి చోరీ
ఇదే సహకార బ్యాంకు పరిసరాల్లో సుమారు ఎనిమిది నెలల క్రితం తాళం వేసి ఉంచిన బండి చోరీకి గురైనట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. తాజాగా అదే ప్రాంతంలో ఏటీఎంను ధ్వంసం చేసి భారీ మొత్తంలో నగదు చోరీ కావడంతో పాత ఘటనను కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రైస్ మిల్లు వద్ద స్కూటీ.. ఇళ్ల వద్ద కార్లు
గొల్లపాలెం రామాంజనేయ రైస్ మిల్లు వద్ద నెలరోజుల క్రితం అడపా సూరిబాబుకు చెందిన యాక్సెస్ స్కూటీ చోరీకి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అంతకుముందు ఇళ్ల వద్ద పార్క్ చేసి ఉంచిన కార్లు సైతం చోరీకి గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. గొల్లపాలెంలో చోరీకి గురైన నేతి భగవాన్‌కు చెందిన కారును పోలీసులు ట్రేస్ చేసిన ఘటన కూడా ఉంది.
మొగలిపాలెం గ్రామంలో ఇంటి వద్ద ఉన్న బుల్లెట్‌ను దొంగిలించిన ఘటన, ఇటీవల శీలలంక గ్రామంలో తాళం వేసిన ఇంట్లో నగదు, బంగారు వస్తువులు చోరీకి గురైన ఘటనలు కూడా పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైనట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఒక్కో ఘటన ఒక్కో ప్రాంతంలో జరిగినప్పటికీ.. వరుసగా వాహనాలు, ఇళ్లు, వ్యాపార ప్రదేశాలు, చివరకు బ్యాంకు ఏటీఎం లక్ష్యంగా మారడం ప్రజల్లో భద్రతపై ఆందోళనకు కారణమవుతోంది.
నిఘా ఉన్నా.. నేరాలు ఎలా?
ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కొన్ని ఘటనలు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి పనితీరు, నిర్వహణ, రికార్డింగ్ సామర్థ్యంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంకు ఏటీఎంను పగులగొట్టి నగదు చోరీ చేయడం స్థానికుల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎలా సాధ్యమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
దొంగలు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారా? సీసీ కెమెరాలను ఎలా నిలిపివేయాలో వారికి అవగాహన ఉందా? విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వెనుక ప్రణాళిక ఉందా? చోరీకి ముందు పరిసర ప్రాంతాలను రెక్కీ చేశారా? గతంలో జరిగిన వాహన చోరీలకు, తాజా బ్యాంకు చోరీకి ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
డ్రోన్ నిఘా.. సీసీ కెమెరాల పరిస్థితి ఏంటి?
పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో నిఘా వ్యవస్థలు ఎంతవరకు పనిచేస్తున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? వాటి ఫుటేజీ సక్రమంగా భద్రపరుస్తున్నారా? ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
అలాగే రాత్రి గస్తీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పోలీసులకు అసలు సవాల్ ఇదే!
తాజా బ్యాంకు ఏటీఎం చోరీలో నిందితులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనడం దర్యాప్తును మరింత కీలకంగా మారుస్తోంది. సంఘటనా స్థలంలో లభించిన ఇనుప రాడ్, సీసీ కెమెరాల సాంకేతిక వివరాలు, మొబైల్ ఫోన్, ఇతర ఆధారాలు నిందితుల గుర్తింపులో కీలకంగా మారే అవకాశం ఉంది.
నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు గతంలో జరిగిన దొంగతనాల కేసుల వివరాలను కూడా పరిశీలిస్తే నిందితుల కదలికలపై కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది.
ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే..
వరుస దొంగతనాలతో ప్రజల్లో భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో తాజా బ్యాంకు చోరీ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి, చోరీకి గురైన సొత్తును రికవరీ చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన గస్తీ, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
గొల్లపాలెం సహకార బ్యాంకు ఏటీఎం చోరీ ఇప్పుడు కేవలం రూ.4.35 లక్షల నగదు చోరీ కేసుగా మాత్రమే కాకుండా.. వరుస దొంగతనాల నేపథ్యంలో స్థానిక పోలీసింగ్, రాత్రి గస్తీ, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక నిఘాపై సమాధానం కోరుతున్న కేసుగా మారింది. ఈ సవాల్‌ను పోలీసులు ఏ మేరకు ఛేదిస్తారో వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular