వేటపాలెం, సెప్టెంబర్ 26 : వేటపాలెం మండలం, దేశాయిపేట సెక్టార్ పరిధిలోని మంకెనవారిపాలెం అంగన్వాడీ కేంద్రం వద్ద శనివారం పోషకాహార మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే విధానంపై తల్లులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సజ్జ లీలావతి తల్లులకు సజ్జ బూరెలు వంటి పోషకాహార వంటకాల తయారీని ప్రత్యక్షంగా చూపించారు. చిరుధాన్యాలతో చిన్నారులకు వివిధ రకాల పోషకాహార పదార్థాలను తయారు చేసి పెట్టాలని సూచించారు. పిల్లలకు జంక్‌ఫుడ్ అలవాటు చేయకుండా, ఇంట్లోనే శుభ్రమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని ఆమె సూచించారు. చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యానికి చిరుధాన్యాలు, స్థానికంగా లభించే పోషక పదార్థాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సజ్జ లీలావతి తెలిపారు. తల్లిదండ్రులు పోషకాహారంపై అవగాహన పెంచుకుని పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

