కోనసీమ తిరుమల వాడపల్లిలో గోవింద నామస్మరణతో మారుమోగిన మాడవీధులు
ఆత్రేయపురం పెన్ పవర్ మే 16
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సందోహంతో కళకళలాడింది. అమావాస్య శనివారం కావడంతో తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ముఖ్యంగా ఏడువారాల నోము చేసుకునే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణాలు నిర్వహిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
వేకువజామున మేలుకొలుపు సేవతో ప్రారంభమైన ఆలయ కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అనంతరం అర్చకులు స్వామివారికి అలంకరణోత్సవం, సుప్రభాత సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం తదితర విశేష పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలి హారతి సమయంలో “గోవిందా… గోవిందా…” నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. స్వామివారి నిలువెత్తు దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ ఎక్కడా అసహనం కనబడలేదు.

ఏడు వారాల నోము చేసుకునే మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణాలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మండుటెండలను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఉప కమిషనర్ నల్ల సూర్య చక్రధర్ రావు ఆధ్వర్యంలో చల్లటి తాగునీరు, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని వేలాది మంది భక్తులు స్వీకరించారు. పలువురు దాతలు అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించగా, ఆలయ చైర్మన్ వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి చిత్రపటాలను బహుకరించారు.భక్తుల రద్దీతో వాడపల్లి క్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, గోవింద నామస్మరణతో మాడవీధులన్నీ మారుమోగాయి.

