Homeఆంధ్రప్రదేశ్కాకినాడమొగలిపాలెంలో విషాద ఛాయలు

మొగలిపాలెంలో విషాద ఛాయలు

రోడ్డు ప్రమాదంలో వైసీపీ కార్యకర్త
బసివి రెడ్డి మృతి

పార్థివదేహానికి నివాళులర్పించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్
కాజులూరు, పెన్ పవర్,సెప్టెంబర్ 6: కుటుంబ సభ్యులతో కలిసి రోజువారీ పనుల నిమిత్తం బయలుదేరిన ఓ కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో మొగలిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన బసివి రెడ్డి (52) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పార్టీ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగలిపాలెం గ్రామానికి చెందిన బసివి రెడ్డి తన కుమారుడితో కలిసి వ్యాపార నిమిత్తం శనివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో తుని బయలుదేరారు. హైవే మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో పిఠాపురం హైవే వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో బసివి రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మొగలిపాలెంలోని స్వగృహానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఇక లేరన్న విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. ఆయన మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
అంకితభావంతో పనిచేసిన కార్యకర్త
బసివి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా అనేక సంవత్సరాలుగా సేవలందించారు. పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడిగా, జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నాయకులు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండేవారని పలువురు గుర్తుచేసుకున్నారు.
పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయడంతో పాటు గ్రామంలోని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే స్వభావం ఆయన సొంతమని నాయకులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఆయన ఆకస్మిక మరణం పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు.
పార్థివదేహానికి ఎంపీ నివాళులు
బసివి రెడ్డి మృతి విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మొగలిపాలెంలోని ఆయన నివాసానికి చేరుకుని పార్థివదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ బసివి రెడ్డి పార్టీ కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు.బసివి రెడ్డి మృతితో కుటుంబ సభ్యులే కాకుండా పార్టీ శ్రేణులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమతో ఆత్మీయంగా మెలిగిన వ్యక్తి ఇక లేరన్న బాధను పలువురు నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేశారు.పలువురు నాయకుల నివాళులు
బసివి రెడ్డి పార్థివదేహానికి జడ్పీటీసీ వనుము వెంకట సుబ్బారావు, నియోజకవర్గ బీసీ సెల్ కన్వీనర్ పితాని సుబ్రహ్మణ్యం, శలపాక నీటి సంఘం అధ్యక్షుడు తాడి రామారెడ్డి, నెక్కింటి పెదబాబు,పోతురాజు బాబురావు, తాతబ్బాయి, సూరంపూడి భాను, నల్లమిల్లి ఈశ్వర్ రెడ్డి, జక్కన రాజేష్, మండా గోవింద్ రెడ్డి, ఉంగరాల లక్ష్మణరావు, టేకుమూడి దుర్గారావు తదితరులు నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బసివి రెడ్డి మృతి మొగలిపాలెం గ్రామానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular