Homeతెలంగాణసాయి తేజ ర్యాగింగ్ మృతి కేసులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమన్లు.

సాయి తేజ ర్యాగింగ్ మృతి కేసులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమన్లు.

సాయి తేజ ర్యాగింగ్ మృతి కేసులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ సమన్లు

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అక్టోబర్ 28న హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్ పెన్ పవర్, అక్టోబర్ 1: 

హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి సాయి తేజ ర్యాగింగ్, వేధింపుల అనంతరం మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి షరతులతో కూడిన సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. సాయి తేజను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్, వేధింపులకు గురిచేశారని, మృతి చెందే ముందు తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ స్వీయచిత్రీకరణ వీడియోను నమోదు చేసినట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర విద్యార్థి సభావట్ కళ్యాణ్ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం ర్యాగింగ్ నిరోధక నిబంధనలు, విశ్వవిద్యాలయ మంజూరీ సంఘం మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ విషయంపై చర్యల నివేదిక సమర్పించాలని గతంలో కమిషన్ ఆదేశించినప్పటికీ, నాలుగు నెలలకు పైగా గడిచినా సంబంధిత అధికారుల నుంచి స్పందన రాలేదని కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1993లోని 13వ సెక్షన్ కింద చర్యలు చేపట్టిన కమిషన్, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి 2026 అక్టోబర్ 28న మధ్యాహ్నం 2 గంటలకు న్యూఢిల్లీలోని మానవ హక్కుల భవన్‌లో కమిషన్ ఎదుట హాజరై, కేసుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రతిని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపింది. ఈ కేసు జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నంబర్ 69/36/2/2026గా నమోదైంది. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక నిబంధనలను కఠినంగా అమలు చేసి విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని ఫిర్యాదుదారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular