రేషన్ డీలర్లకు జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు
చింతూరు, పెన్ పవర్ నవంబర్ 3:
ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వలేదని, ఈ-కేవైసీ పూర్తి చేయలేదనే కారణాలతో రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేయరాదని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ స్పష్టం చేశారు. కొంతమంది రేషన్ డీలర్లు ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వలేదని, ఈ-కేవైసీ చేయించుకోలేదని రేషన్ సరుకులు పంపిణీ చేయడం లేదనే విషయం రాష్ట్ర, జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వలేదని లేదా ఈ-కేవైసీ పూర్తి చేయలేదని రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేయాలని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని రేషన్ కార్డుదారులందరికీ యథావిధిగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. ఎవరైనా రేషన్ డీలర్లు ఈ కారణాలను చూపిస్తూ రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి నిరాకరిస్తే బాధితులు వెంటనే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రేషన్ సరుకుల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

