Homeఆంధ్రప్రదేశ్కాకినాడజగన్నాథగిరి ఎంపీటీసీ సమరంలో సత్తిబాబు సైకిల్ స్పీడు!

జగన్నాథగిరి ఎంపీటీసీ సమరంలో సత్తిబాబు సైకిల్ స్పీడు!

టీడీపీ అభ్యర్థి వనుం సత్యనారాయణ ప్రచారంలో జోరు

మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రచారంతో మరింత ఆసక్తికరంగా మారనున్న పోరు
కాజులూరు, పెన్‌పవర్, నవంబర్ 2:
కాజులూరు మండల రాజకీయాల్లో జగన్నాథగిరి ఎంపీటీసీ ఎన్నిక ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున వనుం సత్యనారాయణ (సత్తిబాబు) అనూహ్యంగా బరిలోకి దిగడంతో మండల రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. టికెట్ కేటాయింపులో కొంత జాప్యం జరిగినప్పటికీ, పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆయన ప్రచార రంగంలోకి దిగి సైకిల్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు దీటుగా తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.ఎంపీటీసీ అభ్యర్థిగా సత్తిబాబు పేరు ఖరారు కాకముందు నుంచే ఆయనకు ఎంపీపీ పదవి దక్కుతుందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగింది. అయితే ముందుగా జగన్నాథగిరి ఎంపీటీసీ స్థానంలో పోటీ చేయాలని, మిగిలిన రాజకీయ అంశాలను ఎన్నికల అనంతరం పరిశీలిస్తామని కూటమి నాయకులు భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో సత్తిబాబు గ్రామంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు.
స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ, చెరువుల అభివృద్ధి పనులతో పాటు రొయ్యల మేత విక్రయ రంగంలోనూ గుర్తింపు పొందిన వ్యక్తిగా సత్తిబాబుకు పరిచయాలు ఉన్నాయని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. గ్రామ ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం, స్థానిక సమస్యలపై అవగాహన తనకు అనుకూలంగా మారుతాయని ఆయన వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జగన్నాథగిరిలో కూటమి పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గాజు గ్లాసు, ఫ్యాన్ గుర్తుల అభ్యర్థులతో పోటీ నెలకొన్నప్పటికీ సత్తిబాబు సైకిల్ గుర్తుతో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జగన్నాథగిరి గ్రామంలో తన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సత్తిబాబు వెల్లడించారు. మంత్రి ప్రచారానికి రానుండటంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఎన్నికల సందడి మరింత పెరిగింది. పార్టీ సీనియర్ నాయకుల మద్దతుతో ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని సత్తిబాబు భావిస్తున్నారు.
మొత్తంగా జగన్నాథగిరి ఎంపీటీసీ స్థానం కాజులూరు మండల రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. తక్కువ సమయంలోనే ప్రచారాన్ని వేగవంతం చేసిన వనుం సత్యనారాయణ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందన్నది స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular