డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: భారత ప్రసాద్
యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకోవడం సమాజ బాధ్యత: భారత ప్రసాద్
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ ముందుకు రావాలి
హైదరాబాద్, పెన్ పవర్, నవంబరు 3:
నేటి సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతోందని, ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులవడం ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ వైజ్ కంజుమర్స్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శి భారత ప్రసాద్ అవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ…
మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను, దేశ భవిష్యత్తును సైతం దెబ్బతీస్తుందని అన్నారు. డ్రగ్స్ మత్తులో యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారని, ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ చూపుతూ, వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ దుష్ప్రభావాలపై తరుచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, సామాజిక సేవా వంటి రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని కోరారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంలో పోలీసు శాఖతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారిని చిన్నచూపు చూడకుండా, వారికి వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి సాధారణ జీవనంలోకి తీసుకురావడం కూడా మన సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.
డ్రగ్స్ రహిత సమాజమే ఆరోగ్యకరమైన సమాజమని అన్నారు. యువతను కాపాడుకోవడం అంటే దేశ భవిష్యత్తును కాపాడుకోవడమేనని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని భారత ప్రసాద్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనకు వరల్డ్ వైజ్ కంజుమర్స్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.

