కిర్లంపూడి/ప్రత్తిపాడు, పెన్ పవర్, మార్చి 13:కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో గత కొన్ని రోజులుగా పెద్దపులి దోబూచులాడడంతో ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలోని రాజవరం, మాసంపల్లి గ్రామాల మధ్య ఉన్న సరుగుడు తోటల్లో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించడంతో జనం హడలిపోతున్నారు.
రేడియో కాలర్ రహస్యం-సాంకేతిక నిఘా
పులి కదలికలను కనిపెట్టడంలో జీపీఎస్ రేడియో కాలర్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో ఏదైనా టైగర్ రిజర్వ్ పరిధిలో ఈ పులిని గుర్తించిన శాస్త్రవేత్తలు, దానికి మత్తుమందు ఇచ్చి శాస్త్రీయ అధ్యయనం కోసం ఈ కాలర్‌ను మెడలో అమర్చారు. ఇది శాటిలైట్ ద్వారా నిరంతరం సిగ్నల్స్‌ను కంట్రోల్ రూమ్‌కు పంపిస్తుంది. ఒకవేళ సాంకేతిక లోపం వల్ల సిగ్నల్ నిలిచిపోతే అధికారులకు సవాలు తప్పదు. అటువంటి సమయంలో కేవలం థర్మల్ సెన్సార్ డ్రోన్లు, అడవిలో అక్కడక్కడా అమర్చినా,కెమెరా ట్రాప్‌లు, మరియు పులి అడుగుజాడల ఆధారంగానే గాలింపు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిగ్నల్ అందుతుండటంతో పులి ఎక్కడుందో అధికారులు ఎప్పటికప్పుడు పసిగట్టగలుగుతున్నారు.రంగంలోకి ఎన్‌ఎస్‌టీఆర్ నిపుణులు.
పులిని బంధించే ఆపరేషన్ అత్యంత క్లిష్టమైనది కావడంతో, నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుండి ప్రత్యేక నిపుణుల బృందాలను పిలిపించినట్లు సమాచారం. వీరు రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్తోపాటు వెటర్నరీ డాక్టర్లతో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొననున్నారు. ముఖ్యమైన అంశాలు
*ఎన్ టిసిఎ అనుమతి…*
పులిని బంధించే ముందు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆ అనుమతి రాగానే ఆపరేషన్ ముమ్మరం కానుంది.
*ట్రాంక్విలైజర్ సిద్ధం* అవసరమైతే పులికి మత్తుమందు ఇచ్చి అదుపులోకి తీసుకునేందుకు మత్తు తుపాకులతో నిపుణులు సిద్ధంగా ఉన్నారు.
* బోన్ల ఏర్పాటు: పులి సంచార మార్గాల్లో ఇప్పటికే భారీ ఇనుప ట్రాప్ బోన్లనుఅధికారులు ఏర్పాటు చేశారు.
*డ్రోన్లతో గాలింపు.. ప్రజలకు హెచ్చరిక*
అటవీ ప్రాంతం దట్టంగా ఉండటంతో పులి కంటికి కనిపించకుండా తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే, హై-టెక్ డ్రోన్లు మరియు అడవిలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌ల ద్వారా ప్రతి కదలికపై నిఘా ఉంచారు. శంఖవరం మండలంలోని గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో పులిని పట్టుకుని సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని అటవీశాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ రోజు సాయంత్రం జి కొత్తపల్లి మీదుగా వెళ్తున్న స్కూల్ బస్సు లోని విద్యార్థులకు పులి కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు.ప్రస్తుతం పులి జి కొత్తపల్లి అచ్చంపేట ప్రాంతాలమధ్య సంచరిస్తున్నట్లు సమాచారం.
ఏది ఏమైనప్పటికీ స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలో ‘పులి’ కలకలం ప్రత్తిపాడు నియోజకవర్గంలో హైఅలర్ట్
RELATED ARTICLES



