ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆర్టికల్స్టార్గెట్ కౌశిక్ రెడ్డి...బిగుస్తున్న ఉచ్చు

టార్గెట్ కౌశిక్ రెడ్డి…బిగుస్తున్న ఉచ్చు

📰 Generate e-Paper Clip

  • సీపీపై వ్యాఖ్యల కేసులో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
  • ఏప్రిల్ 4 విచారణకు హాజరు కావాలంటూ అధికారుల ఆదేశం
  • ఇది రాజకీయ కక్ష సాధింపే అంటూ రేవంత్ సర్కార్‌పై విమర్శలు
  • కుటుంబాన్ని టార్గెట్ చేయొద్దని ట్విట్టర్ వేదికగా ఆవేదన
  • ప్రశ్నించే గొంతును అణచలేరంటూ పోరాటం కొనసాగిస్తానన్న ఎమ్మెల్యే

కరీంనగర్, పెన్ పవర్ ఏప్రిల్ 01:

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై వివాదాస్పద, మతపరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై స్పందించిన కౌశిక్ రెడ్డి.. ఇది రాజకీయ కక్ష సాధింపు అని తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని.. ప్రజల తరఫున తన పోరాటం ఆపనని ఆయన స్పష్టం చేశారు.హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చిక్కులు తప్పటం లేదు. ఇప్పటికే అసెంబ్లీలో కడియం శ్రీహరిని బెదిరించారన్న ఆరోపణలతో ఆయనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా.. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ గౌస్ ఆలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 29న వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులకు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు తనను, తన కుటుంబాన్ని జాతర వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను ఉద్దేశించి ఆయన మతంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేసారు. ఏప్రిల్ 4న జరిగే విచారణలో కౌశిక్ రెడ్డి వివరణ తీసుకోనున్నారు. గత కొంతకాలంగా అధికార పక్షంపై నిప్పులు చెరుగుతున్న కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు రావడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇది కక్షపూరిత చర్య అని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని అంటోంది.ఈ నోటీసులపై పాడి కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రశ్నించే గొంతును అణచలేరని.. ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఏ తప్పు చేయకపోయినా నోటీసులు పంపారని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. తాను వెనక్కి తగ్గేది లేదని ట్వీట్ చేశారు. ‘ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నాకు, నా కుటుంబానికి, మా BRS కుటుంబ సభ్యులకు CID నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో నా కుటుంబ సభ్యులను ,మా BRS కుటుంబ సభ్యులను ఇలా బెదిరింపులకు గురిచేయడం తగునా? రాజకీయాలు నాపై చేయండి.. కానీ నా కుటుంబాన్ని, మా BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం?రేవంత్ రెడ్డి గారు.. నన్ను లక్ష్యంగా చేసుకోండి.. నాపై కేసులు పెట్టండి.. నాకు నోటీసులు ఇవ్వండి.. కానీ నా కుటుంబాన్ని, నా BRS కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాధాకరం. అయినా సరే.. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. నేను వెనక్కి తగ్గను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు.. ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. నిలదీస్తూనే ఉంటాను. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు. ప్రజల కోసం చేసే బాధ్యత. ప్రశ్నించే గొంతును అణచలేరు..ప్రజల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ అని కౌశిక్ రెడ్డి ట్వీట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular