స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, ఏప్రిల్ 11:పాడేరు ఐటిడిఏ నూతన ప్రాజెక్ట్ అధికారిగా ఆదిత్య వర్మ శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పనిచేసిన తిరుమాని శ్రీపూజ నుండి ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఆదిత్య వర్మ కుటుంబ సమేతంగా మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యస్వామి వారికి ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం ఐటిడిఏ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పరిపాలనాధికారి హేమలత పుష్పగుచ్ఛం అందజేసి సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పూల బొకేలతో ఆదిత్య వర్మను అభినందిస్తూ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో సేవ చేసే అవకాశం లభించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా కృషి చేస్తానని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు, మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన విద్యా, వైద్య సేవల అందుబాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని చెప్పారు.కార్యాలయ పనితీరులో పారదర్శకత పాటిస్తూ గిరిజనుల సమస్యలను సత్వర పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటానని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని ఆదిత్య వర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలనాధికారి హేమలత, అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ కళ్యాణి తదితరులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పాడేరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఆదిత్య వర్మ బాధ్యతలు స్వీకారం
RELATED ARTICLES

