- వైసీపీకి వరమా, స్వయంకృత శాపమా?
- తెలంగాణ ప్రతిపక్ష పార్టీ డిజిటల్ ఫోకస్ ఏపీపై ఎందుకు?
- సొంత రాష్ట్ర సమస్యల కంటే పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మక్కువ
- చంద్రబాబు – టీడీపీపై లక్ష్యంగా సాగుతున్న సోషల్ మీడియా యుద్ధం
- వైసీపీ డిఫెన్స్‌లో బీఆర్ఎస్ అనుకూల హ్యాండిల్స్ చురుకుదనం
- తిరుమల లడ్డూ వివాదం నుంచి ప్రతి అంశంలోనూ అండ
- కేడర్‌లో పెరుగుతున్న అయోమయం, అసంతృప్తి
- రేవంత్ ప్రభుత్వంపై పోరాటం ఎందుకు సద్దుమణిగింది?
- రెండు పార్టీల మధ్య అప్రకటిత అవగాహన అనుమానాలు
- లైకులు – షేర్లు ఓట్లుగా మారవా? రాజకీయ వాస్తవం
- డిజిటల్ వ్యూహం వల్ల పార్టీ గ్రాఫ్‌పై ప్రభావం
స్టేట్ పొలిటికల్ బ్యూరో – పెన్ పవర్ విజయవాడ, ఫిబ్రవరి 24:
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు వింత ధోరణి కనిపిస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, తమ సొంత పార్టీ ప్రయోజనాల కంటే పొరుగు రాష్ట్రంలోని వైసీపీ కోసం ఓవర్ టైమ్ పనిచేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ పార్టీ సోషల్ మీడియా విభాగామైనా తమ నాయకుడిని ప్రమోట్ చేసుకోవడం లేదా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై దృష్టి పెడుతుంది. కానీ, బీఆర్ఎస్ డిజిటల్ సైన్యం మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో భారీ యుద్ధమే చేస్తోంది.బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు తమ పోస్టింగ్స్‌లో ఎక్కువ శాతం ఏపీ రాజకీయాలకే కేటాయిస్తున్నారు. టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం, వైసీపీ వాదనను గట్టిగా వినిపించడం వీరి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారం కావచ్చు లేదా ఇతర రాజకీయ అంశాలు కావచ్చు, వైసీపీ డిఫెన్స్‌లో ఉన్న ప్రతిసారీ బీఆర్ఎస్ అనుకూల హ్యాండిల్స్ ఆ పార్టీకి అండగా నిలబడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారులతో నిరంతరం వివాదాలకు దిగుతూ, ఏపీ రాజకీయాల్లో వేలు పెడుతున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు.వైసీపీకి మద్దతు ఇచ్చే క్రమంలో బీఆర్ఎస్ తన సొంత అస్తిత్వాన్ని పక్కన పెడుతోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటం కంటే, ఏపీలో టీడీపీని అడ్డుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని క్షేత్రస్థాయి కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ ప్రధాన వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన సమయంలో, ఇతర పార్టీల తరపున బ్యాటింగ్ చేయడం వల్ల కేడర్‌లో అయోమయం నెలకొంటోంది.తెలంగాణ నుంచి అందుతున్న ఈ సోషల్ మీడియా మద్దతు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ప్రశ్నార్థకమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ రాష్ట్ర సమస్యలపై స్పందించేటప్పుడు పక్క రాష్ట్ర పార్టీల జోక్యాన్ని ఎంతవరకు స్వాగతిస్తారనేది ఆలోచించాల్సిన విషయం. పైగా, ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్న ప్రచారం వల్ల రెండు పార్టీలు ఒక్కటే అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. ఇది ఇటు ఏపీలో వైసీపీకి, అటు తెలంగాణలో బీఆర్ఎస్‌కు రాజకీయంగా ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు.బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఈ సోషల్ మీడియా ధోరణిని గమనిస్తోందో లేదో కానీ, నెటిజన్లు మాత్రం దీనిపై సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ గడ్డపై తమ గళాన్ని వినిపించడంలో వెనుకబడి, ఏపీ రాజకీయాల్లో తలదూర్చడం వల్ల పార్టీ గ్రాఫ్ తగ్గుతోందని విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, షేర్లు ఓట్లుగా మారవు అన్న కనీస సత్యాన్ని విస్మరించి, కేవలం ఎదుటి పక్షంపై విద్వేషాన్ని వెదజల్లడమే పనిగా పెట్టుకోవడం వల్ల పార్టీ విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉంది.



